వెంకటేష్ తదుపరి సినిమా ఎవరి చేతిలో?

Share


సీనియర్ హీరో వెంకటేష్ చాలా కాలం తర్వాత ఘన విజయాన్ని అందుకున్నారు. సొలో హీరోగా ఆయనకు పెద్ద హిట్ రావడం ఏళ్ల తరువాత జరిగింది. వెంకటేష్ కెరీర్ ముగిసిపోయిందని, ఇకపై యంగ్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తే బాగుంటుందని అనేక మంది వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ విమర్శలన్నింటికీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో గట్టి సమాధానం ఇచ్చారు. సరైన కథ దొరికితే తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడంతా వెంకటేష్ తదుపరి సినిమా ఏమిటన్న ఆసక్తి నెలకొంది. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్‌టైనర్ చేసి హిట్ అందుకున్న వెంకటేష్, మళ్లీ అదే జానర్‌లో సినిమా చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. కానీ వెంకటేష్ మాత్రం ఈసారి యాక్షన్ జోనర్లో సినిమాకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

గత రెండు నెలలుగా వెంకటేష్ పలు కథలు విన్నారని సమాచారం. ముఖ్యంగా వి.వి. వినాయక్, సురేందర్ రెడ్డి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వినాయక్ గతంలో ‘లక్ష్మి’ సినిమాను వెంకటేష్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని, దీనికి వెంకటేష్ ఆసక్తి చూపుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని అనుకున్నా, అది సాధ్యంకాకపోవడంతో అదే కథను వెంకటేష్‌కి వినిపించారని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు టాక్. ప్రస్తుతం వెంకటేష్ – వినాయక్ సినిమాను నల్లమలుపు బుజ్జి నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ఇద్దరు దర్శకులు గతంలో ఇండస్ట్రీలో హిట్ మేకర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వీరు సక్సెస్ ఇవ్వగలరా? అనే విషయంలో ప్రేక్షకుల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇంతలోనే వెంకటేష్ ఈ ఇద్దరు దర్శకులతో సినిమా ఒప్పుకున్నాడనే వార్తలు, ఆయన అభిమానుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.

ఇప్పటివరకు వెంకటేష్ తన కొత్త ప్రాజెక్టుపై ఎలాంటి అధికారిక అప్‌డేట్ ఇవ్వలేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలై రెండు నెలలు పూర్తవుతున్న ఈ సమయంలో, కొత్త సినిమా ఎవరితో చేస్తాడనే దానిపై మరికొంతకాలం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. వెంకటేష్ తన తర్వాతి సినిమాకు ఎవరిని డైరెక్టర్‌గా ఎంచుకుంటారో వేచి చూడాలి.


Recent Random Post: