శంకర్-అజిత్ కాంబో పై ఆసక్తికర చర్చ!

Share


కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ క్రేజ్ ఒక్కప్పుడు తారాస్థాయిలో ఉండేది. స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయాలని పోటీ పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన ఇటీవల తీసిన ఇండియన్ 2 మరియు గేమ్ ఛేంజర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చడంతో, ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శంకర్ సినిమాల్లో స్క్రీన్‌ప్లే, కథా కథనాలపై తీవ్ర ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన చేతిలో ఇండియన్ 3 ఉన్నప్పటికీ, సినిమా నిర్మాణంపై అనేక అనిశ్చితి నెలకొంది. చాలా వరకు షూటింగ్ పూర్తయినా, సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఇంకా స్పష్టత రాలేదు.

ఇదిలా ఉండగా, లైకా ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది, ప్రస్తుతం రెడ్ జెయింట్ పిక్చర్స్ టేకోవర్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ 2 వల్ల భారీ నష్టాలు రావడంతో లైకా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెడ్ జెయింట్ ఇప్పుడు చిత్రాన్ని పూర్తి చేసి వీలైనంత త్వరగా విడుదల చేయాలని చూస్తోంది.

ఇంకా, గేమ్ ఛేంజర్ ప్రమోషన్ సమయంలో శంకర్ తన తదుపరి చిత్రం వేల్పూరి నవల ఆధారంగా ఉంటుందని వెల్లడించారు. అయితే, ఎవరు హీరోగా నటిస్తారనేది మాత్రం చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం, ఈ కథతో తమిళ స్టార్ హీరో అజిత్ తో సినిమా చేయాలని శంకర్ ఆలోచిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, అజిత్ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనేది ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం అజిత్ స్పెయిన్ లో రేసింగ్ కాంపిటీషన్లలో పాల్గొంటున్నారు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇక, అజిత్ ఇటీవల విడుదలైన పట్టుదల సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. అయితే, ప్రస్తుతం ఆయన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో అజిత్ – శంకర్ కాంబినేషన్ రియలైజ్ అవుతుందా? లేక మరొక హీరోతో శంకర్ తన వేల్పూరి ప్రాజెక్ట్ ని తీసుకెళ్తారా? అనేది సినీ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.


Recent Random Post: