శోభిత ధూళిపాళ్‌కు బిగ్ ఛాన్స్ – పా రంజిత్ సినిమా లో కీలక పాత్ర!

Share


నాగచైతన్యను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన శోభిత ధూళిపాళ్, ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి సారిస్తోంది. గతంలో ఓ వెబ్ మూవీ చేసింది కానీ, కంటెంట్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే, ఇప్పుడు శోభితకు ప్రముఖ తమిళ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో పనిచేసే అవకాశం లభించినట్లు సమాచారం.

పా రంజిత్ మూడేళ్ల క్రితమే వెట్టువమ్ అనే ప్రాజెక్టును అనౌన్స్ చేశారు, అంటే తంగలాన్ సినిమాకన్నా ముందే. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. మధురై బ్యాక్‌డ్రాప్‌లో ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది.

ఈ సినిమాలో విశేషంగా చర్చనీయాంశంగా మారిన అంశాలు కొన్ని ఉన్నాయి. వరుడు ఫేమ్ ఆర్య ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రలో కనిపించనుండగా, తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న దినేష్ లీడ్ రోల్ పోషించనున్నాడు. కథ విషయానికి వస్తే, దొంగతనాలను వృత్తిగా మార్చుకున్న హీరో, తన శత్రువులను అంతమొందించేందుకు పోలీస్ అవతారం ఎత్తుతాడు. అయితే, తన ఊహించిన దానికంటే భిన్నంగా, ఖాకీ వ్యవస్థలో మరింత భయంకరమైన నిజాలు తెలిసి ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటాడు.

కథాంశం పూర్తిగా వినూత్నంగా అనిపించకపోయినా, పా రంజిత్ ట్రీట్మెంట్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తున్న నేపథ్యంలో, శోభితకు ఇది ఓ గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. పా రంజిత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఎక్కువగా ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఊరికే పాటలు పాడే క్యారెక్టర్లు కాకుండా, కథలో బలమైన క్యారెక్టర్‌కి ప్రాధాన్యం ఇస్తాడు. తంగలాన్లో మాళవిక మోహనన్‌కి ఇచ్చిన క్యారెక్టర్‌దే దీనికి ఉదాహరణ.

అయితే, మూడేళ్ల క్రితం అనౌన్స్ చేసి నిలిపివేసిన సినిమాను ఇప్పుడు రీస్టార్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు రజనీకాంత్‌తో వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్న ఈ విలక్షణ దర్శకుడు, ఆ తర్వాత కొంత గాడితప్పినట్లు కనిపించినా, ఇప్పటికీ ఆయన సినిమాలపై ప్రత్యేక అంచనాలు పెట్టుకునే అభిమానులు ఉన్నారు. వెట్టువమ్ విజయవంతమైతే, పా రంజిత్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశముంది.


Recent Random Post: