సల్మాన్ ఖాన్ భయానక విమాన అనుభవం – 45 నిమిషాల ఉత్కంఠ!

Share


తాజాగా విమాన ప్రయాణాల భద్రతపై అనేక సందేహాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. గడచిన నెల రోజుల్లో మూడు అంతర్జాతీయ విమాన ప్రమాదాలు చోటు చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. విమాన ప్రయాణం అన్ని సమయాల్లో సురక్షితమనే నమ్మకాన్ని పెంచలేని పరిస్థితి ఏర్పడింది. వాతావరణ మార్పులు, సాంకేతిక లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం వంటి అనేక అంశాలు విమాన ప్రమాదాలకు కారణమవుతుండగా, తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన జీవితంలో అత్యంత భయానక అనుభవాన్ని పంచుకున్నారు.

ఒక అవార్డు షో ముగించుకుని శ్రీలంక నుంచి తిరిగి వస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా, ఆమె తల్లి, సల్మాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ అందరూ ఒకే విమానంలో ప్రయాణించారు. ఆరంభంలో అందరూ సరదాగా నవ్వుకుంటూ ప్రయాణం సాగించారు. అయితే కొంతసేపటికే విమానం తీవ్రమైన కుదుపులకు లోనైంది. దాదాపు 45 నిమిషాల పాటు విమానం తీవ్ర అల్లకల్లోలానికి గురవడంతో ప్రయాణికులంతా భయంతో వణికిపోయారని సల్మాన్ గుర్తు చేసుకున్నారు. మొదట ఇది సాధారణ టర్బులెన్స్ అనుకున్నప్పటికీ, క్రమంగా తీవ్రత పెరగడం ప్రారంభమైంది. పైలట్ ముఖంలో ఆందోళన కనబడగా, ఎయిర్ హోస్టెస్ ప్రార్థనలు చేస్తున్నట్లు కనిపించిందని ఆయన చెప్పారు. అప్పుడే పరిస్థితి తీవ్రంగా ఉందని అర్థమైందని, ఆక్సిజన్ మాస్కులు కిందికి పడిపోయిన దృశ్యం నిజజీవితంలో చూడటం తొలిసారని వెల్లడించారు.

దాదాపు 45 నిమిషాల పాటు ఆందోళనకు లోనైన తర్వాత కొంతసేపటికి పరిస్థితి సద్దుమణిగినప్పటికీ, మళ్లీ మరో 10 నిమిషాల పాటు అదే పరిస్థితి ఎదురైంది. విమానం ల్యాండ్ అయినప్పటికీ, అందరూ నిశ్శబ్దంగా, భయంతోనే ఉన్నారని, కానీ భూమిపై కాలు మోపిన క్షణం అందరూ ఊపిరిపీల్చుకున్నట్లు అనిపించిందని సల్మాన్ తెలిపారు. ఆ అనుభవం జీవితంలో మరిచిపోలేనిదని చెప్పిన ఆయన, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరెవరికీ ఎదురుకాకూడదని ఆకాంక్షించారు.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘సికందర్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఘటన మరోసారి విమాన ప్రయాణ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. మరి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురుకాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.


Recent Random Post: