
భారతీయ చలన చిత్రాల్లో హీరోల పాత్రల తీరు ఎలా ఉండాలో దర్శకులు మరోసారి ఆలోచించాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మృతి చెందిన తెలుగు సినీ నటి, నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు, ప్రస్తుతం సినిమాల తీరు గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలో సినిమాలు సమాజానికి మంచిని బోధించే కథలు, దేశభక్తి, సాంప్రదాయ విలువలు ప్రతిబింబించేలా ఉండేవని ఆయన గుర్తుచేశారు. కానీ ఇప్పుడు, దేశద్రోహులు, స్మగ్లర్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసే వారే హీరోలుగా చూపించటం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కథలు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తాయో దర్శకులు చింతించాల్సిన అవసరం ఉందని వెంకయ్య అభిప్రాయపడ్డారు.
సినిమా ఒక బాధ్యతాయుతమైన మాధ్యమమని, చెడు పనులను ప్రోత్సహించే విధంగా కథలను మలచకూడదని ఆయన సూచించారు. ముఖ్యంగా, పిల్లలపై సినిమాల్లోని హీరోల పాత్రల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. కథల రూపకల్పనలో మంచి విలువలను నిలబెట్టే విధంగా మార్పులు తేవాలని సూచించారు.
ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో వస్తున్న కథనాలపై బీజేపీ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఇదే తరహా అభిప్రాయాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి, సినిమాల్లో హీరోల పాత్రలపై సమాజంలో చర్చనీయాంశం ఏర్పడింది.
Recent Random Post:















