“స్టార్‌డమ్ శాశ్వతం కాదు” – అమీర్ ఖాన్

Share


ఈ రంగుల ప్రపంచంలో స్టార్లు, సూపర్‌స్టార్లు ఎందరో ఉన్నారు. వారి వారసులు సినీ పరిశ్రమను ఏలుతున్నారు. అయితే, ఈ స్టార్‌డమ్ శాశ్వతమా? అనే ప్రశ్నకు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు.

హిందీ చిత్రసీమలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురిని ‘చివరి స్టార్స్’గా భావించడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశాడు. ప్రతి తరానికి కొత్త తరం స్టార్లు వచ్చి తమదైన గుర్తింపు తెచ్చుకుంటారని, కాలక్రమేణా మార్పు సహజమని అమీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. 90వ దశకంలో వచ్చిన స్టార్‌డమ్ ఈ తరం నటులకు సాధ్యం కాకపోవచ్చనే భావన పూర్తిగా తప్పు అని, నేటితరం నటీనటులు కూడా తమదైన శైలిలో అభివృద్ధి చెందుతారని అన్నారు. భవిష్యత్తులో కొత్త స్టార్‌లు పుట్టుకొచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటారని అమీర్ ఖాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఈ మార్పు ప్రకృతి నియమమని, ఎవరూ ఎప్పటికీ వెలుగులో ఉండలేరని, కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతాయని అమీర్ అన్నారు. “ఇది ఒక సృష్టి చక్రం. కొత్త తరం స్టార్‌లు రాగానే పాత తరం మసకబారడం సహజం. మార్పును ఆపలేం, అందుకే కొత్త వారిని స్వాగతించాలి” అని తనదైన స్పష్టతతో తెలిపారు.

తాజాగా తన పుట్టినరోజున ఖాన్ త్రయం కలిసి ఓ చిత్రంలో నటించాలనే అంశంపై చర్చించుకున్నామని అమీర్ ఖాన్ వెల్లడించాడు. సరైన స్క్రిప్ట్ దొరికినప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పిన ఆయన, ఇది అసాధారణమైన కథ కాకపోయినా, ప్రేక్షకులు తమ ముగ్గురిని తెరపై కలిసిచూడటాన్ని ఆస్వాదిస్తారని అన్నారు. ప్రస్తుతం షారుఖ్, సల్మాన్, అమీర్ ముగ్గురూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని, వీరి కలయిక కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారని సమాచారం.


Recent Random Post: