‘స్పిరిట్’లో ద‌గ్గుబాటి అభిరామ్‌కి ఛాన్స్‌నా?

Share


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ–ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిప్తీ డిమ్రీ, విలన్‌గా దక్షిణ కొరియా నటుడు డాంగ్ సియోక్ ఎంపికైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ప్రభాస్ శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. సందీప్ సినిమాల్లో హీరో పాత్రలకు ఉండే పవర్, యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు — సిస్టమ్‌ను చేతుల్లోకి తీసుకునే హీరో అంటే అదీ సందీప్ మార్క్ యాక్షన్! కాబట్టి, ‘స్పిరిట్’లో ప్రభాస్ పాత్ర ఏ రేంజ్‌లో హైలైట్ అవుతుందో ఊహించవచ్చు.

ఇక ఈ సినిమాలో పలు ముఖ్యమైన పాత్రలు ఉండనున్నాయి. అందులో ఒక కీలక పాత్రకు ద‌గ్గుబాటి అభిరామ్ ఎంపికైందన్న టాక్ ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ పాత్ర అతని రియల్ లైఫ్ పర్సనాలిటీకి దగ్గరగా ఉంటుందని అంటున్నారు. అభిరామ్ యాటిట్యూడ్, స్టైల్‌ను దృష్టిలో ఉంచుకుని సందీప్ ఆ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారని సమాచారం.

అభిరామ్ ఈ అవకాశం పొందితే, అది అతని కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఫిల్మ్ నిపుణులు భావిస్తున్నారు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘అహింస’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిరామ్, ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఇక రానా నిర్మాతగా బిజీగా ఉంటే, అభిరామ్ మాత్రం సినిమాల నుంచి దూరంగా ఉన్నాడు.

ఇలాంటి సమయంలో ‘స్పిరిట్’లో పాత్రకు అభిరామ్ పేరు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో నటించే అవకాశాల కోసం చాలా మంది స్టార్‌లు ఆసక్తి చూపుతున్నారనే విషయం తెలిసిందే. ఇంతవరకు మంచు విష్ణు కూడా సినిమాలో అవకాశం కోసం లేఖ రాశారని టాక్. ఇలాంటి కఠినమైన పోటీలో అభిరామ్ పేరు తెరపైకి రావడం నిజంగా విశేషం. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.


Recent Random Post: