
ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్, సీజీ పనితనం నాసిరకంగా ఉందని ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ హీరోతో ఇలాంటి అవుట్‌పుట్ రావడం పట్ల అభిమానులు నిరాశ చెందారు.
ఈ విమర్శల నేపథ్యంలో, ప్రేక్షకులకు మెరుగైన అనుభూతి కల్పించేందుకు మేకర్స్ తాజా నిర్ణయం తీసుకున్నారు. అప్డేటెడ్ వెర్షన్‌ను అన్ని థియేటర్లలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించారు. “ధర్మం కోసం పోరాటం ఇంకా పెద్దదైంది” అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
అలాగే టికెట్ ధరల విషయంలోనూ మార్పులు చేస్తున్నారు. తెలంగాణలో సోమవారం నుంచి, ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 2 నుంచి టికెట్ రేట్లు తగ్గనున్నాయి. భారీ ధరల కారణంగా థియేటర్లకు రావడంలో ఇబ్బంది పడుతున్న ప్రేక్షకులకు ఇది ఉపశమనం కలిగించవచ్చు.
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసినా, ఇలాంటి సాంకేతిక తప్పిదాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదాహరణ లేదు.
పీరియడిక్ బ్యాక్‌డ్రాప్‌లో పవన్ నటించిన సినిమా ఇది మొదటిసారి కావడంతో, వీఎఫ్ఎక్స్ మరియు సీజీకి అధిక ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఈ విభాగాల్లో లోపాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది.
పవన్ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో సినిమా విడుదల చాలా ఆలస్యమైంది. అలాగే పవన్ స్వభావం ప్రకారం, ఆయన నటించిన సినిమాలను తానే చూడరని, విడుదల తర్వాత సినిమాకు సంబంధించి పెద్దగా పట్టించుకోరని చాలా సందర్భాల్లో చెప్పారు.
అయితే హరిహర వీరమల్లు ప్రమోషన్ విషయంలో మాత్రం పవన్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. మీడియా ముందుకు వచ్చి ప్రోత్సహించడం ఆయన కెరీర్లో అరుదైన విషయం. నిర్మాత ఏ.ఎం. రత్నంతో ఉన్న స్నేహం కారణంగానే పవన్ ఈసారి ఇలా ముందుకు వచ్చారని చెబుతున్నారు.
Recent Random Post:















