
మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “హరిహర వీరమల్లు” సినిమా మే 9న విడుదల కావాల్సి ఉంది. విడుదలకు ఇంకా 29 రోజులు మాత్రమే ఉన్న ఈ సమయానికి, సినిమాతో పాటు పవన్ వ్యక్తిగత, రాజకీయ జీవితం కూడా ఒత్తిడికి గురవుతోంది.
తాజాగా, పవన్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో స్వల్పంగా గాయపడడంతో ఆయన ఆందోళనకు లోనయ్యారు. కుటుంబానికి అండగా ఉండేందుకు సింగపూర్ వెళ్లిన పవన్, మరో రెండు మూడు రోజుల్లో తిరిగి రానున్నారు. ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనాల్సిన అవకాశం కూడా ఉండటంతో రాజకీయ బాధ్యతలు మరింత భారంగా మారాయి.
ఇదంతా జరగుతున్న నేపథ్యంలో, సినిమా చివరి షెడ్యూల్ పూర్తి చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్స్ చేయడం అన్నీ కలిపి చాలా సవాలుగా మారిపోయాయి. ఇప్పటికే ఆశించినంత బజ్ లేకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా షెడ్యూల్ పూర్తి కాకపోవడంతో ఓటిటి హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ కూడా థియేటర్ రిలీజ్ వాయిదా పడితే, డీల్ మొత్తాన్ని రివైజ్ చేస్తామన్నట్టు వార్తలు వచ్చాయి. ఇది ఫ్యాన్స్ లో మరింత గందరగోళం కలిగిస్తోంది.
ఈ సినిమాకు మొదట్నుంచే చిక్కులు వదలట్లేదు. కరోనా కారణంగా మొదట డెలే అయ్యింది. తర్వాత వర్షాల కారణంగా సెట్లు దెబ్బతిన్నాయి. ఆర్టిస్టుల డేట్స్ దొరకడం కష్టమవడంతో మరోసారి బ్రేక్ పడింది. ఇక జనసేన రాజకీయంగా బిజీ కావడంతో పవన్ షూటింగులకు టైమ్ కేటాయించలేకపోయారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ – గ్యాప్ దొరికితే తప్ప సినిమాకు సమయం కేటాయించటం అసాధ్యం.
ఈ అన్ని పరిస్థితుల్లో హరిహర వీరమల్లు అనేది అసలు విడుదల అవుతుందా? లేక మరింత వాయిదా పడుతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు ఫ్యాన్స్ మదిలో మారుమోగుతోంది.
ఒకవేళ ఈ పద్మవ్యూహం నుంచి బయట పడాలంటే పవనే అర్జునుడిగా మారి, విజృంభించాల్సిన సమయం ఇదే కావచ్చు.
Recent Random Post:















