అజిత్ మరోసారి కార్ రేసింగ్ ప్రమాదం

Share


మోటార్‌స్పోర్ట్‌ అంటే ప్రాణంగా ప్రేమించే తల అజిత్, తాజాగా విదాముయార్చి సినిమాతో బాక్సాఫీస్‌ ద‌గ్గ‌ర తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. పొరుగు భాషల్లో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, తమిళనాడులో మాత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 60 కోట్ల వసూళ్లను క్రాస్ చేసింది.

ఇదిలా ఉంటే, అజిత్ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరుగుతున్న భారీ మోటార్‌స్పోర్ట్‌ రేసింగ్‌ ఈవెంట్‌ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. ఎస్టోరిల్‌లో నిర్వహిస్తున్న స్ప్రింట్ ఛాలెంజ్‌లో ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్న సమయంలో, అతని కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అయితే, అతడు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన తర్వాత అజిత్ మాట్లాడుతూ, ఇది కేవలం చిన్న ప్రమాదమేనని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్నాడు. ప్రమాదం తర్వాత తనకు అందిన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

“మేము మళ్లీ ట్రాక్‌ పైకి వచ్చి గెలుస్తాం. ప్రమాదం అనుకోని సంఘటన. అయితే మాకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం సంతోషకరం. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు!” అని అజిత్‌ వ్యాఖ్యానించాడు.

గతంలోనూ దుబాయ్‌లోని 24H రేసింగ్‌ ఈవెంట్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు, అతని కారు నియంత్రణ కోల్పోయి బౌండరీని ఢీకొట్టింది. అప్పుడు కూడా అజిత్‌ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. ఇప్పుడు రెండోసారి ట్రాక్‌పై ప్రమాదం ఎదురైనా, అదృష్టవశాత్తూ ఏమీ కాలేదని అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

కెరీర్‌ విషయానికి వస్తే, అజిత్‌ త్వరలో అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవలి విడుదలైన విదాముయార్చి నాలుగు రోజుల్లోనే రూ. 62 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే, సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బారినపడడం గమనార్హం. అయినప్పటికీ, అజిత్‌ అభిమానులు థియేటర్లకే వెళ్లి సినిమాను చూస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.


Recent Random Post: