
తమిళ స్టార్ అజిత్ కుమార్ ఇటీవల నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా గుడ్ బాడ్ అగ్లీ కమర్షియల్‌గా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అధిక్ రవిచంద్రన్, మార్క్ ఆంటోనీ తో తన ప్రత్యేక కథన శైలిని ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అజిత్ విశ్వాసం పొందిన అధిక్ రవిచంద్రన్‌తో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.
తాత్కాలికంగా AK 64 అనే పేరుతో ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్‌లో మరో స్టార్ ఎంట్రీ ఉంటుందన్న వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. కన్నప్ప సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారట. మోహన్లాల్కి కథను వినిపించగా, ఆయనకూ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం పారితోషికం అంశంపై చర్చలు జరుగుతున్నాయి, అది ఖరారయితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తమిళ చిత్రాల్లో అరుదుగా కనిపించే మోహన్‌లాల్, ఈసారి అజిత్‌తో కలిసి నటించడం ఆయన కెరీర్‌కి కూడా ప్రత్యేకం కానుంది. నేషనల్ అవార్డు గెలుచుకున్న మోహన్‌లాల్‌కు భారత సినిమా రంగంలో ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి స్టార్‌తో అజిత్ కలయిక సినీ అభిమానులకు పండుగ కానుంది.
ఇక హీరోయిన్ విషయానికొస్తే, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి అజిత్ సరసన నటించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ జంటని తెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. గుడ్ బాడ్ అగ్లీ నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈ భారీ బడ్జెట్ మాస్ ఎంటర్టైనర్ని నిర్మించనుంది. మ్యూజిక్, టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
Recent Random Post:















