అమీర్ ఖాన్ దేశభక్తి వ్యాఖ్యలపై స్పందన

Share


ఇంకొన్నాళ్లలో విడుదల కాబోతున్న “సితారే జమీన్ పర్” సినిమా కోసం అమీర్ ఖాన్ చేస్తున్న ప్రమోషన్లు ఇప్పటివరకు అతని కెరీర్‌లోనే భిన్నంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా అమీర్ ఖాన్ చిత్రం రాబోతుందంటే ఆడియన్స్‌కి భారీ అంచనాలు ఏర్పడతాయి. కానీ ఈసారి మాత్రం హైప్ లో కొంత వెనకడుగు కనిపిస్తోంది.

దీనికి ప్రధాన కారణాలు — మాస్ అప్పీల్ లేకపోవడం, పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలవకపోవడం, ట్రైలర్ పై కొన్ని నెగటివ్ కామెంట్లు రావడం. ఇవన్నీ కలిసే సినిమాపై అంచనాలను తగ్గించాయి. అయినా అమీర్ మాత్రం తనదైన శైలిలో చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ, మీడియా ఇంటర్వ్యూలు ఇస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఈ ఇంటర్వ్యూలలో దేశభక్తి అంశం ప్రస్తావనకువచ్చింది. పెహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ వంటి సందర్భాల్లో తన స్పందన లేకపోవడం గురించి అమీర్ వివరణ ఇచ్చాడు. తాను సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ ఉండకపోవడం వల్లే అప్పుడు స్పందించలేకపోయానని స్పష్టం చేశాడు. అయితే, ఆ ఘటనల సమయంలోనే ట్రైలర్ విడుదలను పది రోజుల పాటు వాయిదా వేయడం ద్వారా తన బాధను వ్యక్తం చేశానని చెప్పాడు.

పాకిస్థాన్ వ్యతిరేక కథలపై వచ్చిన ఎన్నో స్క్రిప్ట్‌లు తిరస్కరించిన అమీర్, దేశ ప్రజల్లో సామాజిక స్పృహ పెంచేందుకు “సత్యమేవ జయతే” వంటి షోలు చేశాడు. అలాగే గ్రామీణాభివృద్ధి కోసం పాని ఫౌండేషన్ స్థాపించి, అనేక ప్రాంతాల్లో నీటి సమస్యలకు పరిష్కారాలు అందించాడు.

సర్ఫరోష్, లగాన్, మంగళ్ పాండే వంటి సినిమాల ద్వారా యువతలో దేశభక్తిని రగిలించే ప్రయత్నం చేశాడు. లగాన్ సినిమాను ఎన్నో స్టూడియోలు తిరస్కరించినా, తానే నిర్మాతగా ముందుకు వచ్చి ఆ సినిమాలో రిస్క్ తీసుకున్నాడు. గత కొన్ని దశాబ్దాల్లో సినిమా పరిశ్రమలో, దేశ అభివృద్ధికి తనవంతు కృషి చేశానని ఆయన అభిప్రాయపడ్డాడు.

దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ వంటి సినిమాలు చైనాలో కూడా పెద్ద విజయాలు సాధించగలిగిన కారణం – అందులో ఉన్న మానవతా విలువలేనని చెప్పారు. పాన్ మసాలా యాడ్స్ చేయకుండా తానొక బాధ్యత గల నటుడిగా వ్యవహరిస్తున్నానని వివరించారు.

తనపై వచ్చే విమర్శల్ని ఎదుర్కొంటూ – “నా దేశభక్తిని ప్రశ్నించకండి,” అని అమీర్ స్పష్టం చేస్తున్నారు. గతంలో “ఇండియాలో భద్రత లేకపోవడం” అనే వ్యాఖ్యపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఆ పరిణామాన్ని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు ఆయన అందించిన వివరణ మరోసారి చర్చకు తెరలేపుతోంది.


Recent Random Post: