
పాన్ ఇండియా స్థాయిలో సౌత్ సినిమాలు విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ చిత్రాలు నేషనల్ లెవెల్లో దూసుకెళ్తుండటంతో, బాలీవుడ్ భామలు తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆలియా భట్, దీపికా పదుకొణె, కియారా అద్వాణీ వంటి టాప్ నటీమణులు టాలీవుడ్లో అడుగుపెట్టగా, మరికొందరు కూడా తమ అవకాశం కోసం వేచి చూస్తున్నారు.
ఆలియా భట్ టాలీవుడ్లో RRR సినిమాలో నటించిన తర్వాత ఇంకా తెలుగు సినిమాల్లో చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇటీవల ఆమె నటించిన ‘జిగ్రా’ సినిమా బాలీవుడ్లో ఆశించిన విజయం అందుకోకపోవడంతో, మళ్లీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆలియా ‘ఆల్ఫా’, ‘లవ్ అండ్ వార్’ వంటి హిందీ చిత్రాల్లో నటిస్తోన్నప్పటికీ, తెలుగు సినిమా ఛాన్స్ వస్తే కాదనడానికి ఇష్టపడడం లేదు. క్రేజీ కాంబినేషన్ల కోసం ఎదురుచూస్తున్న ఆమెకు, టాలీవుడ్ ప్రొడ్యూసర్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక దీపికా పదుకొణె, కల్కి 2898 AD సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పోషించిన సుమతి పాత్ర విపరీతమైన ఆదరణ పొందడంతో, ‘కల్కి 2’లోనూ ఆమె పాత్ర కొనసాగనుందని టాక్. దీపికా కూడా తెలుగులో మరిన్ని ప్రాజెక్ట్‌లను చేయాలని భావిస్తోందని తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న సినిమాల్లో నటించేందుకు ఆమె ఆసక్తి చూపుతోందని, అంతేగాక, ఎంత రెమ్యునరేషన్ కావాలన్నా ఇచ్చేందుకు టాలీవుడ్ మేకర్స్ సిద్ధంగా ఉన్నారని సమాచారం.
అలియా భట్, దీపికా పదుకొణె లాంటి స్టార్ హీరోయిన్లతో పాటు జాన్వి కపూర్ కూడా టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ‘దేవర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, ఇప్పటికే ‘దేవర 2’ లోనూ నటించనుందని తెలుస్తోంది. అంతేకాదు, రామ్ చరణ్ – బుచ్చిబాబు ప్రాజెక్ట్ లోనూ జాన్వి నటించే అవకాశం ఉందని సమాచారం.
ఒకప్పుడు బాలీవుడ్ భామలు ప్రాంతీయ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ సినిమాల స్టామినా, నేషనల్ లెవెల్ బాక్సాఫీస్ వసూళ్లు చూసి, ఇక్కడ చేసే సినిమాలు వారికి మాసివ్ రీచ్ తెచ్చిపెడతాయని గ్రహించారు. అందుకే, తెలుగు సినిమా అవకాశాలు వస్తే వదులుకోకూడదనే ధోరణితో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు టాలీవుడ్‌కు క్యూ కడుతున్నారు.
Recent Random Post:














