ఆమిర్ ఖాన్ కొత్త స్ట్రాటజీ: యూట్యూబ్‌లోనే సినిమా రిలీజ్

Share


బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తాజా చిత్రం సితారే జమీన్ పర్ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శనలు ముగించుకుని ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌ లోకి అడుగుపెట్టింది. సినిమా ప్రారంభం నుండి ఓటీటీలకు అమ్మకూడదనే నిర్ణయాన్ని పాటించిన ఆమిర్, తన మాట నిలబెట్టుకున్నారు.

తాజాగా థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమాను ఆమిర్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో పే-పర్-వ్యూ మోడల్‌లో రిలీజ్ చేశారు. ప్రేక్షకులు రూ.100 చెల్లించి ఈ చిత్రాన్ని 48 గంటల పాటు చూడొచ్చు. అయితే యాపిల్ డివైసుల్లో మాత్రం ఈ రెంట్ రూ.179గా చూపించడంతో కొంతమంది ఫిర్యాదులు చేశారు.

దీనిపై ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ స్పందిస్తూ, “ధరలో తేడా వచ్చిన సమస్యను గమనించాం. వీలైనంత త్వరగా సరిచేస్తాం. సహకరించినందుకు ధన్యవాదాలు” అని అధికారిక ప్రకటన ఇచ్చింది.

సినిమా విడుదల విషయంలో ఈ సరికొత్త ఆలోచన వెనుక కారణం గురించి ఆమిర్ మాట్లాడుతూ, “ప్రేక్షకులు తక్కువ ధరలో సినిమాలను చూడగలిగేలా చేయడమే నా ఉద్దేశ్యం. పెద్ద పెద్ద ఓటీటీలకు అమ్మడం కన్నా, నేరుగా అందరికీ చేరడం మంచిదని అనిపించింది. ఈ విధానం వల్ల థియేటర్లలో చూసే అనుభూతిని కూడా కొనసాగించవచ్చు” అన్నారు.

కేవలం సితారే జమీన్ పర్ మాత్రమే కాకుండా, తన పాత సినిమాలను కూడా త్వరలో యూట్యూబ్‌లో పే-పర్-వ్యూ ద్వారా అందుబాటులోకి తెస్తానని ఆమిర్ తెలిపారు. కొత్త దర్శకులకు కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా అవకాశం ఇస్తానని చెప్పారు. ఇకపోతే తన ఫేమస్ టీవీ షో ‘సత్యమేవ జయతే’ని ఉచితంగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఆమిర్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Recent Random Post: