ఆర్సీ 16 ఢిల్లీ షెడ్యూల్ – పార్లమెంట్ షూటింగ్‌కు పవన్ కల్యాణ్ సహాయం?

Share


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ 16 చిత్రీకరణ వేగంగా సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయి, తదుపరి ఢిల్లీ షెడ్యూల్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్‌తో పాటు ఇతర ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇంతకుముందు ప్రచారంలో వచ్చినట్లుగా ఢిల్లీ షెడ్యూల్ కుస్తీ పోటీ సన్నివేశాలకు సంబంధించినది కాదని తాజా సమాచారం. అసలు విషయం ఏమిటంటే, చిత్రబృందం పార్లమెంట్‌లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయాలని భావిస్తోంది.

అయితే, పార్లమెంట్ భవనంలో షూటింగ్ అనుమతులు పొందడం అంత సులభం కాదు. గతంలో సినిమాల షూటింగ్ అనుమతులు తేలికగా లభించేవి, కానీ ప్రస్తుతం అనుమతులు పొందడానికి మరింత ప్రొసీజర్‌ అనుసరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో, ఆర్సీ 16 టీమ్ ఈ అనుమతుల కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయాన్ని కోరినట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం అయినప్పటికీ, ఎన్డీయే కూటమిలో తన పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్‌ను ఢిల్లీలో బలంగా ప్రదర్శిస్తున్న నాయకుడిగా ఎదిగారు. కేంద్ర ప్రభుత్వం నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉండటంతో, పవన్ కల్పిస్తే పార్లమెంట్ షూటింగ్ అనుమతులు సులభంగా వచ్చే అవకాశముంది.

అంతేకాదు, జామా మసీద్ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. అయితే, దీని కోసం రంజాన్ తర్వాత అనుమతులు రాబోయే అవకాశముంది. దీంతో, ముందుగా పార్లమెంట్ అనుమతులు వస్తే అక్కడి షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

ఇక, క్యాన్సర్ చికిత్స నుంచి కోలుకుంటున్న శివ రాజ్ కుమార్ ఈ వారంలో షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం. ఇప్పటికే ఆయనపై కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది, మిగిలిన భాగాన్ని త్వరలో పూర్తి చేయనున్నారు.

ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి విడుదల తేదీ ప్రకటించనప్పటికీ, ఆర్సీ 16 అనుకున్న గడువులో షూటింగ్ పూర్తిచేసుకుని, భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావాలని చిత్రబృందం ప్రణాళిక వేస్తోంది.


Recent Random Post: