పార్టీ బోయ్ ఒర్రీపై FIR .. షాకింగ్ రీజన్!

Share


బాలీవుడ్ పార్టీ మోగా ఓర్రీ అకా ఓర్హాన్ అవత్రమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ స్టార్ సెలబ్రిటీ పార్టీ అయినా అతను అక్కడ ఉండాల్సిందే. ముఖ్యంగా బాలీవుడ్ గాళ్స్ గ్యాంగ్ తో అతడు చేసే సందడి గురించి సినీ ప్రియులకు బాగా తెలుసు. అయితే, తాజాగా అతడు అడ్డంగా బుక్క‌య్యాడు!

జమ్మూ-కాశ్మీర్ పోలీసులు ఓర్రీ సహా మరొక ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వైష్ణో దేవి ఆలయం సమీపంలోని కాట్రా ప్రాంతంలో నిషేధిత ప్రాంతంలో మద్యం సేవించినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారిక సమాచారం.

పోలీసుల కథనం ప్రకారం, కాట్రాలోని హోటళ్లలో మద్యం సేవించడం చట్టవిరుద్ధం. అయినా, ఓర్రీ సహా అతడి స్నేహితులు అక్కడ పార్టీ చేసుకున్నారు. నిందితుల్లో రష్యా మహిళ అనస్తాసిలా అర్జామస్కినాతో పాటు దర్శన్ సింగ్, పార్థ్ రైనా, రితిక్ సింగ్, రాశి దత్తా, రక్షిత భోగల్, షాగున్ కోహ్లీ ఉన్నారు. వీరిపై కాట్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ (నెంబర్ 72/25) నమోదు అయింది.

వైష్ణో దేవి ఆలయం హిందూ మతంలో పవిత్ర తీర్థక్షేత్రంగా భావిస్తారు. అందువల్ల కాట్రా పరిధిలో మాంసాహారం, మద్యం సేవనంపై కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. కానీ ఓర్రీ, అతడి గ్యాంగ్ ఈ నియమాలను ఉల్లంఘించి తప్పు చేశారని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మతపరమైన ప్రదేశాల్లో మద్యం లేదా మాదకద్రవ్యాల వినియోగాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రియాసి ఎస్ఎస్పీ స్పష్టం చేశారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఓర్రీ పై జరిగిన కేసు హాట్ టాపిక్ గా మారింది. మరి, ఈ వివాదం అతని సెలబ్రిటీ స్టేటస్‌ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి!


Recent Random Post: