ఘాటి సినిమాతో అనుష్క మళ్లీ దుమ్ము రేపుతుంది

Share


‘బాహుబలి’ తరువాత అనుష్క శెట్టి ఎంతో సెలెక్టివ్‌గా ప్రాజెక్టులు ఎంచుకుంటూ, ప్రధానంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ సాగుతోంది. ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో ప్రేక్షకులను అలరించిన అనుష్క, ఇప్పుడు ‘ఘాటి’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. జూలై 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

ముగింపు పనులు దాదాపు పూర్తవ్వడంతో, టీమ్ త్వరలోనే గ్రాండ్ ప్రమోషన్స్ ప్రారంభించనుంది. వరుసగా లిరికల్ వీడియోలు విడుదల చేస్తూ సినిమాపై హైప్ పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో అనుష్క ప‌వ‌ర్‌ఫుల్ పాత్రలో కనిపించనుందన్న విషయం ఇప్పటికే బయటకు వచ్చింది.

ఈ సినిమాకు విడుదల ముందు నుంచే భారీ డిమాండ్ ఏర్పడినట్టు సమాచారం. గ్లింప్స్ ఆకట్టుకోవడంతో పాటు అనుష్క మళ్ళీ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్న నేపథ్యంలో ‘ఘాటి’ నాన్-థియేట్రికల్ బిజినెస్‌కు భారీ క్రేజ్ ఏర్పడింది. క్రిష్-అనుష్క కాంబినేషన్‌గా మరోసారి వస్తున్న సినిమా కావడంతో నాన్-థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.36 కోట్లకు విక్రయమైనట్లు సమాచారం. లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఇంత భారీ డీల్ దక్కడం ఇండస్ట్రీలో రికార్డుగా చెబుతున్నారు.

ఈ సినిమాకు మొత్తం రూ.45 కోట్ల బడ్జెట్ కాగా, నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఇప్పటికే 90 శాతం వరకు రికవరీ అయింది. థియేట్రికల్ బిజినెస్ పూర్తయ్యే సరికి రిలీజ్‌కు ముందే లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో నిర్మాతలు థియేట్రికల్ బిజినెస్‌ను త్వరలోనే ముగించేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రంలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతిబాబు ముఖ్య పాత్రలు పోషించారు. విద్యాసాగర్ సంగీతాన్ని అందించగా, వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. త్వరలో ప్రారంభం కానున్న ప్రమోషన్స్‌లో అనుష్క కూడా పాల్గొననుంది.


Recent Random Post: