డిసెంబర్ 12న రజని అభిమానులకు పడయప్ప పండుగ!

Share


సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌గా అభిమానులు గుర్తు పెట్టుకునే చిత్రాలు అంటే ముందుగా గుర్తొచ్చేవి భాష, నరసింహ, దళపతి. ఈ సినిమాలు కేవలం రజని ఫ్యాన్స్‌కే కాదు, సాధారణ సినీ ప్రేక్షకులను కూడా పదే పదే చూసేలా కట్టిపడేసిన ఎంటర్టైనర్లు. ముఖ్యంగా నరసింహ సినిమాలోని కమర్షియల్ ఎలిమెంట్స్ అనేక మంది దర్శకులకు ఇప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

ఇప్పుడు అలాంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌ల జాబితాలోని మరో మహా చిత్రం ‘పడయప్ప’ మరోసారి థియేటర్లలో అలరించేందుకు సిద్ధమైంది. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న పడయప్ప ఒరిజినల్ తమిళ వెర్షన్‌ను రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 1999లో విడుదలైన ఈ ఇండస్ట్రీ హిట్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్, కల్ట్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

1999 ఏప్రిల్ 10న విడుదలైన పడయప్ప, అప్పటివరకు లేని విధంగా 210 ప్రింట్లతో విడుదలై ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. అంతేకాదు, అప్పట్లోనే ఏకంగా ఏడు లక్షల ఆడియో క్యాసెట్లు మార్కెట్లో విడుదలై సంచలనం రేపింది. సినిమా విడుదలైన ప్రతి చోటా వసూళ్ల సునామీనే కనిపించింది. హౌస్ ఫుల్ బోర్డులు తీయాల్సిన అవసరం లేకుండానే రోజుకో రికార్డులు నమోదయ్యాయి. పడయప్ప ప్రభంజనం కారణంగా తదుపరి రెండు మూడు వారాల పాటు కొత్త సినిమాలు విడుదల చేయడానికి ఇతర నిర్మాతలు కూడా వెనుకడుగు వేశారంటే ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమాకు రజనీకాంత్ స్టైలిష్ స్వాగ్, రమ్యకృష్ణ పవర్‌ఫుల్ విలనిజం, ఏఆర్ రెహమాన్ అందించిన చార్ట్‌బస్టర్ పాటలు, సౌందర్య సున్నితమైన నటన, కామెడీ–యాక్షన్ మేళవింపు అన్నీ కలిసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా నీలాంబరీ పాత్రలో రమ్యకృష్ణ నటన ఈ సినిమా స్థాయినే మార్చేసింది.తమిళనాడులో 86 థియేటర్లలో వంద రోజులు, తెలుగులో 49 సెంటర్లలో యాభై రోజులు ప్రదర్శింపబడిన పడయప్ప డబ్బింగ్ సినిమాల చరిత్రలో ఒక అరుదైన రికార్డుగా నిలిచింది. తెలుగులోనూ ఈ చిత్రానికి వచ్చిన స్పందన రజనీకాంత్ మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఇదే సమయంలో అభిమానులు మరొక క్లాసిక్ అయిన నరసింహను కూడా తెలుగులో రీ రిలీజ్ చేయాలని గట్టిగా కోరుతున్నారు. ఎందుకంటే వింటేజ్ రజనీకాంత్ ఎనర్జీని ఆ స్థాయిలో మరో సినిమాలో చూడటం అరుదు. అయితే ప్రస్తుతం తెలుగు హక్కుల యజమాని నిర్మాత ఏఎం రత్నం అందుబాటులో లేకపోవడంతో నరసింహ రీ రిలీజ్ ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో నరసింహ స్థానంలో ‘శివాజీ: ది బాస్’ రీ రిలీజ్ అవుతోంది.

అయితే మొత్తంగా చూస్తే పడయప్ప రీ రిలీజ్ విషయంలో మాత్రం రజని ఫ్యాన్స్ పూర్తిగా లక్కీనే అన్న మాట వినిపిస్తోంది. మరోసారి థియేటర్లలో ఈ మోన్స్టర్ క్లాసిక్‌ను చూడబోతున్నామన్న ఆలోచనతోనే అభిమానుల్లో ఉత్సాహం పీక్ లెవల్‌లో ఉంది.


Recent Random Post: