
దిల్ రాజు తాజా వ్యాఖ్యలు – గేమ్ చేంజర్ ఫలితం, సంక్రాంతికి వస్తున్నాం విజయం
ఈ సంక్రాంతికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఒకటి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన “గేమ్ చేంజర్”, మరొకటి మధ్య తరహా బడ్జెట్‌లో రూపొందిన “సంక్రాంతికి వస్తున్నాం”. అయితే, క్రేజీ కాంబినేషన్, హై బడ్జెట్ ఉన్నప్పటికీ “గేమ్ చేంజర్” బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది. అదే సమయంలో “సంక్రాంతికి వస్తున్నాం” మాత్రం మంచి విజయాన్ని సాధించి, లాభాలను అందించింది.
ఈ నేపథ్యంలో, “సంక్రాంతికి వస్తున్నాం” విజయాన్ని పురస్కరించుకొని జరిగిన సక్సెస్ మీట్లో దిల్ రాజు తన మనసులోని మాటను పరోక్షంగా బయటపెట్టారు. “సినిమాకు కావాల్సింది భారీ బడ్జెట్ కాదు.. కంటెంట్” అని స్పష్టంగా చెప్పారు. కేవలం స్టార్ కాంబినేషన్‌ల మీద ఆధారపడి సినిమాలు తీయడం వల్ల ఎదురైన పరాజయాలను గుర్తు చేసుకున్నారు.
“గతంలో మా సంస్థలో రూపొందిన బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ కథను నమ్ముకుని చేసినవే. చాలా మంది కొత్త దర్శకులతో హిట్లు ఇచ్చాం. కానీ ఇటీవలి కాలంలో కాంబినేషన్‌లపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల కొన్ని అనుకోని ఫలితాలు ఎదురయ్యాయి.” అని పేర్కొన్నారు.
అయితే “సంక్రాంతికి వస్తున్నాం” విజయంతో అనిల్ రావిపూడి మళ్లీ తమ బ్యానర్‌ను ట్రాక్‌లోకి తెచ్చారని, ఇది వారికి ఒక పాఠంగా మారిందని తెలిపారు. ఇకపై కేవలం కాంబినేషన్‌లు, బడ్జెట్‌ను నమ్మకుండా కథ, కంటెంట్‌ను ప్రధానంగా తీసుకుని సినిమాలు నిర్మిస్తామని సంకేతాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా “గేమ్ చేంజర్” తొలి రోజు కలెక్షన్ల పోస్టర్ గురించి వచ్చిన ప్రశ్నకు దిల్ రాజు స్పందిస్తూ, “అది మా వీక్‌నెస్.. అలా ఎందుకు జరిగిందో మీకు అర్థమే” అంటూ ఫ్యాన్స్ కోసమే ఆ పోస్టర్ రిలీజ్ చేశామని అంగీకరించారు.
దిల్ రాజు వ్యాఖ్యలు పరిశ్రమలో కొత్త చర్చకు దారి తీసే అవకాశం ఉంది.
Recent Random Post:















