
మలయాళ సినీ చరిత్రలో ‘దృశ్యం’ చిత్రానికి ఉన్న స్థానం ప్రత్యేకం. మోహన్‌లాల్ హీరోగా, థ్రిల్లర్ జానర్‌లో తనదైన మార్క్ సాధించిన దర్శకుడు జీతు జోసెఫ్ రూపొందించిన ఈ చిత్రం విడుదలైన వెంటనే భారీ సంచలనం సృష్టించింది. పన్నెండేళ్ల క్రితం వచ్చిన సమయంలోనే మలయాళ పరిశ్రమలో ఉన్న అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ‘దృశ్యం’, తరువాత హిందీ, తెలుగు, తమిళం సహా పలు భాషల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్లా సూపర్‌హిట్‌గా నిలిచింది. చైనీస్, సింహళీస్ వంటి విదేశీ భాషల్లో కూడా విజయం సాధించడం ఈ ఫ్రాంచైజ్ ప్రత్యేకత.
కొవిడ్ కాలంలో నేరుగా ఓటీటీలో విడుదలైన ‘దృశ్యం 2’ కూడా అద్భుత స్పందన అందుకున్న తర్వాత, ఫ్రాంచైజ్ మూడో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే మలయాళ వెర్షన్ అధికారికంగా ప్రకటించబడింది, ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో, జీతు జోసెఫ్ దృశ్యం–3 ను హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో కూడా రూపొందించాలని యోచిస్తున్నారు. హిందీ వెర్షన్‌కు అజయ్ దేవగణ్ సిద్ధంగా ఉన్నప్పటికీ, ఒరిజినల్ మలయాళ భాగం విడుదలకు ముందుగా రీమేక్ విడుదల చేయకూడదని జీతు స్పష్టమైన షరతు పెట్టడంతో బాలీవుడ్ వర్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడింది.
తెలుగులో మాత్రం దృశ్యం–3ను స్వయంగా జీతు జోసెఫ్‌నే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. అయితే వెంకటేష్ ఈ ప్రాజెక్ట్‌కు అందుబాటులో ఉన్నారా? అన్న ప్రశ్నలు అభిమానుల్లో ఉత్కంఠ ఏర్పరిచాయి. సంక్రాంతి తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకున్న వెంకీ తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో పెద్ద ప్రాజెక్ట్ ప్రారంబించారు. చాలాకాలంగా ఎదురు చూసిన ఈ చిత్రం పూర్తి కావడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.
ఈ సందర్భంలో వెంకీ రెండు భారీ సినిమాలను ఒకేసారి చేయగలరా? దానికి త్రివిక్రమ్ ఒప్పుకుంటారా? అనేవి ప్రధాన సందేహాలు. ముఖ్యంగా మలయాళ, తెలుగు వెర్షన్లు ఒకేసారి విడుదలైతేనే ప్రభావం ఉంటుంది; లేదంటే ఒరిజినల్ కథ సోషల్ మీడియా ద్వారా ముందే బయటకు రావడం వల్ల తెలుగు వర్షన్‌పై ఆసక్తి తగ్గే అవకాశం ఉంది.
ఇప్పటివరకు ‘దృశ్యం–3 తెలుగు వెర్షన్’, వెంకటేష్ పాల్గొనడం, ప్రొడక్షన్ వివరాలు వంటి అంశాలపై ఎటువంటి అధికారిక ప్రకటనలూ రాలేదు. దీంతో వెంకీ నిజంగా ఈ ఫ్రాంచైజ్ కొనసాగింపులో ఆసక్తి చూపుతున్నారా? అనే ప్రశ్నలు మరింత బలపడుతున్నాయి.
Recent Random Post:














