
మొన్న రాత్రి ప్రీమియర్ షోలతో థియేటర్లలోకి వచ్చిన బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలతో శుభారంభం చేసింది. తొలి రోజు దాదాపు రూ.50 కోట్లకు సమీపంగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా. అయితే, అధికారిక కలెక్షన్ వివరాలు నిర్మాతల నుంచి ఇంకా వెల్లడికాలేదు.
సీక్వెల్‌పై ఉన్న భారీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుంటే ఈ ఓపెనింగ్ నంబర్లు కొంత తక్కువగానే అనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న మిక్స్డ్ టాక్, ఏకగ్రీవంగా లేని రివ్యూలు కలెక్షన్లపై కొంత ప్రభావం చూపుతున్నట్లు ట్రేడ్ విశ్లేషణ. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ప్రెస్ మీట్‌లో నిర్మాతలు కూడా పరిశ్రమలోపల నెగటివిటీ ఉందని, బయట మాత్రం లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటి నుంచి అసలు పరీక్ష మొదలవుతుంది. శని–ఆదివారాల్లో ఇదే ఊపు కొనసాగించాల్సిన అవసరం ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. అయితే సోమవారం కూడా స్ట్రాంగ్ ట్రెండ్ కొనసాగాలంటే, వీకెండ్‌లో సినిమా చూసే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ విస్తృతంగా రావాల్సిందే.
‘అఖండ’ మొదటి భాగం స్థాయిలో అంచనాలు పెంచుకున్న ప్రేక్షకులను పూర్తిస్థాయిలో సంతృప్తిపరచలేకపోయినప్పటికీ, దర్శకుడు బోయపాటి శీను సినిమా క్రమంగా మరింత పెద్ద స్థాయికి చేరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో అభిమానుల మధ్య సక్సెస్ ఈవెంట్లు నిర్వహిస్తూ ఈ మోమెంటమ్‌ను కొనసాగించాలని 14 రీల్స్ ప్లస్ టీమ్ ప్లాన్ చేస్తోంది.
రెండో, మూడో రోజుల్లో సాలిడ్ కలెక్షన్లు వస్తే రికవరీలో సగం వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. ‘అఖండ’ బ్రాండ్ ఇమేజ్ వల్ల వచ్చిన హైప్ సానుకూలమే అయినా, ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ తరహాలో అన్ని వర్గాల నుంచి ఏకగ్రీవమైన పాజిటివ్ స్పందన రాకపోవడం ‘అఖండ 2’కు కొంత మైనస్‌గా మారింది.
ప్రస్తుతం సినిమా స్థిరంగా నిలబడింది. పెద్దగా పోటీ చిత్రాలు లేకపోయినా, నగరాలు–పట్టణాల్లో ‘దురంధర్’ అనూహ్యంగా పికప్ కావడం ఒక్కటే ప్రధాన కాంపిటీషన్‌గా కనిపిస్తోంది. అది తప్ప ‘అఖండ 2’కు ప్రస్తుతానికి గట్టి ప్రత్యర్థి లేదు.
Recent Random Post:















