బాలీవుడ్ మారాలి… సౌత్‌ను ఆదర్శంగా తీసుకోండి: సంజయ్ దత్

Share


బాలీవుడ్‌ స్టార్ నటుడు సంజయ్‌ దత్, గత కొన్నేళ్లుగా హిందీ సినిమాలతో పాటు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలపై ఆసక్తి చూపిస్తూ వరుసగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ లో అడీరిపోయే విలన్ పాత్రతో ఆకట్టుకున్న సంజయ్‌ దత్‌, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కీలకమైన పాత్రలతో కొత్త ఇమేజ్‌ను తెచ్చుకుంటున్నారు.

ఇటీవల కన్నడ చిత్రం ‘కేడీ – ది డెవిల్’ లో కీలక పాత్ర పోషించిన ఆయన, ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాల అభివృద్ధిపై ప్రశంసలు గుప్పించిన ఆయన, బాలీవుడ్ తీరుపై కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“కాలానికి తగ్గట్టు మారకపోతే విజయాలు సాధించలేం. తెలుగు సినిమాలు తీసుకుంటున్న సాహసాలు, కథల పట్ల ఉన్న శ్రద్ధను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం గ్రహించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇంకా నంబర్ల చుట్టూ సినిమాలు తిరుగుతున్నాయి. కంటెంట్‌కు కాకుండా కలెక్షన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు” అని సంజయ్‌ వ్యాఖ్యానించారు.

ఇక గతంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, సంజీవ్ కుమార్ లాంటి దిగ్గజులతో పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ –

“అప్పటి కథలు, స్క్రీన్‌ప్లేలు ఇప్పటి రోజుల్లో నడిచే పరిస్థితి లేదేమో కానీ, కంటెంట్‌కి ప్రాధాన్యత ఇప్పటికీ అవసరమే. అప్పట్లో అందరూ కలిసిచేరి ఓ మంచి సినిమా చేయాలనే లక్ష్యంతో పనిచేసేవాళ్లం. ఇప్పుడు ఆమాటలకి బదులు, నెంబర్ల గేమ్‌ ఎక్కువైంది,” అని తెలిపారు.

సంజయ్ దత్ మాటల్లో బాలీవుడ్ మేకర్స్ పై అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. ఆయన ఇప్పటికే అనేకసార్లు హిందీ ఇండస్ట్రీ మారాలి అనే సందేశాన్ని ఇచ్చినప్పటికీ, వాస్తవికంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

“హిందీ సినిమా తిరిగి పుంజుకోవాలంటే, సౌత్‌ సినిమాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలున్నాయి. కంటెంట్, కథా పరంగా బలంగా ఉండే ప్రయత్నం చేయాలి. కాకపోతే బాలీవుడ్ అనిశ్చితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది,” అని ఆయన హెచ్చరించారు.

సంజయ్ దత్‌ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతున్నాయి. బాలీవుడ్‌ను పునర్జీవితం చేయాలంటే ఇటువంటి అంకితభావం అవసరమని పలువురు విశ్లేషకుల అభిప్రాయం.


Recent Random Post: