మగధీర హిట్ వెనుక అల్లు అరవింద్ పాత్రపై కొత్త చర్చ!

Share


తండేల్ ప్రమోషన్లలో భాగంగా అల్లు అరవింద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, మగధీర సినిమాను తన మేనల్లుడు రామ్ చరణ్‌కు తప్పకుండా హిట్ అందించాలనే ఉద్దేశంతో రాజమౌళితో చేశానని చెప్పుకొచ్చారు. చిరుత యావరేజ్ కావడం వల్ల, ఈసారి ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా, ఎంత బడ్జెట్ అయినా వెనకడుగు వేయలేదని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు వివిధ కోణాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మళ్లీ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వాదనలు మొదలయ్యాయి. తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో గేమ్ ఛేంజర్ గురించి అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలే వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

“మేనమామ ఎగబట్టాడు కాబట్టే రామ్ చరణ్‌కు మగధీర లాంటి హిట్ వచ్చింది” అనే వాదన ఒక వర్గం నుంచి వినిపిస్తోంది. మరోవైపు, మగధీర ప్యాన్-ఇండియా స్థాయి సినిమా అయినా, దానిని ఇతర భాషల్లో సకాలంలో విడుదల చేయకపోవడం తగదని మరికొంతమంది అంటున్నారు. దీనికి తగ్గట్లుగా, గతంలో రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూను బయటకు తీసుకొచ్చి, “ఇది ఇతర భాషల్లో డబ్బింగ్ అయ్యుంటే ఇంకా బాగుండేది” అన్న ఆయన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే, మగధీర గురించి ఇప్పుడు కొత్తగా చర్చించడం అనవసరం. ఎందుకంటే, టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమాల్లో దీని ప్రత్యేక స్థానం ఉంది. కేవలం ఇండస్ట్రీ రికార్డుల పరంగానే కాదు, కంటెంట్ పరంగానూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు గొప్పవే కావొచ్చు, కానీ వాటికి బలమైన పునాది వేసింది మాత్రం మగధీర. ఈ ఘనతకు కారణమైన ముగ్గురు – అల్లు అరవింద్, రామ్ చరణ్, రాజమౌళి. ఎవరు ఏమన్నా, మగధీర ఓ మైలురాయి. గత చర్చలను పక్కన పెట్టి, ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29, ఆర్సి 16 లాంటి సినిమాలు మరింత గొప్పగా రావాలని ఆశించడమే మేలని అభిమానులు భావిస్తున్నారు.


Recent Random Post: