
శబరిమలలోకి అన్యమతస్తులను అనుమతించే విషయంలో ఎప్పటి నుంచో వివాదాలు కొనసాగుతున్నాయి. గతంలో క్రిస్టియన్ అయిన ఏసుదాసు శబరిమలకు వెళ్లాలని అనుకున్నప్పుడు పెద్ద చర్చే నడిచింది. చివరికి ఆయన్ను ఆలయ ప్రవేశానికి అనుమతించడంతో వివాదం ముగిసింది. ఆయన అయ్యప్పపై ఎన్నో భక్తిగీతాలు పాడారు.
ఇప్పుడు మరో అన్యమతస్థుడి కోసం శబరిమలలో పూజ చేయించడంతో మరో వివాదం చెలరేగింది. ఈసారి విషయం ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టికి సంబంధించినది. ఇటీవల మమ్ముట్టి ఆరోగ్య సమస్యల కారణంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ అంటూ కొన్ని పుకార్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఈ నేపథ్యంలో ఆయన ఆప్తమిత్రుడు, మరో లెజెండరీ నటుడు మోహన్ లాల్, శబరిమల ఆలయాన్ని సందర్శించి మమ్ముట్టి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేయించారు. పూజ సందర్భంగా మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి అని ప్రస్తావించడంతో, ఒక ముస్లిం వ్యక్తి కోసం శబరిమలలో పూజ చేయడం పై కొందరు విమర్శలు చేశారు.
ఈ వివాదంపై తాజాగా మోహన్ లాల్ స్పందించారు. “మమ్ముట్టి కోసం పూజ చేయించానని ఆలయానికి సంబంధించిన వారే లీక్ చేసి ఉండొచ్చు. అయితే నా మిత్రుడి ఆరోగ్యం కోసం పూజ చేయించడంలో తప్పేముంది? ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం.” అని స్పష్టం చేశారు. అలాగే మమ్ముట్టి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న మమ్ముట్టి, త్వరలో మోహన్ లాల్తో కలిసి మహేష్ నారాయణన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. వృత్తిపరంగా పోటీ ఉన్నా, ఈ ఇద్దరు నటులు దశాబ్దాలుగా మంచి మిత్రులుగా కొనసాగుతుండటం విశేషం.
Recent Random Post:















