
తమిళ సీనియర్ దర్శకుడు ఏఆర్. మురుగదాస్‌కు ఒక సమయంలో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉండేది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఠాగూర్ ఒరిజినల్ వెర్షన్ రమణను తెరకెక్కించింది ఆయనే. తర్వాత సూర్య నటించిన గజిని డబ్బింగ్ వెర్షన్ కూడా తెలుగులో ఘనవిజయం సాధించడంతో మురుగదాస్ పేరు మరింత ప్రాచుర్యం పొందింది. అలాగే తుపాకి సినిమాకు కూడా ఇక్కడ మంచి స్పందన లభించింది.
ఇదిలా ఉండగా, మురుగదాస్ డైరెక్ట్‌గా తెలుగులో స్టాలిన్, స్పైడర్ సినిమాలు చేశాడు. ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా, ఆయనపై తెలుగు ప్రేక్షకుల్లో పాజిటివ్ ఫీలింగ్ మాత్రం ఉండేది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల వల్ల పరిస్థితి మారిపోయింది. “తెలుగు దర్శకుల సినిమాలు వందల కోట్లు వసూళ్లు సాధించవచ్చు, కానీ తమిళ దర్శకుల సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేస్తాయి” అని ఆయన చెప్పిన కామెంట్ పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలో మురుగదాస్‌ను గట్టిగా ట్రోల్ చేశారు.
ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రం మదరాసి తెలుగు ప్రమోషనల్ ఈవెంట్ కోసం హైదరాబాద్‌కు రాకపోవడం మరింత చర్చనీయాంశమైంది. పైగా ఈ ఈవెంట్‌లో హీరో శివకార్తికేయన్ మాట్లాడిన మాటలు మురుగదాస్ వ్యాఖ్యలకు విరుద్ధంగా వినిపించాయి. “కంటెంట్ ఉన్న సినిమా కోసం తెలుగు నిర్మాతలు ఎలాంటి ఖర్చైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటారు, అందుకే ఇక్కడ వెయ్యి కోట్ల సినిమాలు వస్తున్నాయి” అని ఆయన చెప్పడం హైలైట్‌గా మారింది.
అసలు మురుగదాస్ ఈ ఈవెంట్‌కు రాకపోవడానికి కారణం కూడా ఇదే అని అంటున్నారు. మీడియా ఆయనను ఆ కామెంట్ల గురించి ప్రశ్నించి రచ్చ చేయడం ఖాయం కాబట్టి, డ్యామేజ్ కంట్రోల్‌లో భాగంగానే ఆయన దూరంగా ఉన్నారని ఫిలింసర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు శివకార్తికేయన్ చేసిన పాజిటివ్ కామెంట్స్ వల్ల వివాదం తగ్గి, మదరాసి సినిమాను తెలుగు ప్రేక్షకులు సానుకూల దృక్పథంతో చూడాలని టీమ్ ఆశిస్తోంది.
Recent Random Post:















