
గ్లామర్ ప్రపంచంలో కాంటాలాగా గర్ల్గా గుర్తింపు తెచ్చుకున్న షెఫాలి జరివాలా హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన వార్త అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆమె 42 ఏళ్ల వయసులో పూర్తి ఆరోగ్యంగా ఉండి కూడా అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది.
ఇంతకు ముందు ఆమె మాజీ ప్రియుడు, నటుడు సిద్ధార్థ్ శుక్లా కూడా 40 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షెఫాలి కూడా అలానే మృతి చెందడం విషాదకరం.
షెఫాలీకి ఎలాంటి గుండె సంబంధిత వ్యాధులే లేవని ఆమె వ్యక్తిగత వైద్యుడు తెలిపారు. అయితే ఆమె గత కొన్ని సంవత్సరాలుగా యాంటీ ఏజింగ్ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు తీసుకుంటుండేది. అయితే, వాటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కూడా కలుగలేదని వైద్యుడు స్పష్టం చేశారు.
పోలీసుల ప్రాథమిక నివేదికల ప్రకారం, షెఫాలి మృతిపై భర్త నుంచి ఎలాంటి నేర అనుమానాలూ లేవని పేర్కొనబడింది. ప్రస్తుతం పోస్ట్ మార్టం మరియు ఫోరెన్సిక్ రిపోర్టుల ఆధారంగా షెఫాలి ఇంట్లో ఉన్న మెడికల్ రికార్డులు పరిశీలిస్తున్నారు. ఆమె ఇంట్లో రెండు బాక్సుల యాంటీ ఏజింగ్ మందులు, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వీటిలో చర్మాన్ని మెరవచేసే, వయసు పెరగకుండా ఆపే గుణాలు కల గ్లూటాథియోన్ వంటి పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఉపవాస సమయంలో ఆమె ఈ మందులు తీసుకున్నట్లు అర్థమవుతోంది. దీంతో ఆమె రక్తపోటు తీవ్రంగా పడిపోయిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి ఆమెకు ప్రాణాంతకంగా మారిందని అనుమానిస్తున్నారు.
గ్లూటాథియోన్ వంటి యాంటీ ఏజింగ్ పదార్థాలు శరీరానికి కొంత మేలు చేస్తాయని భావించినా, అవి డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. లేదంటే ఇవి అలెర్జీలు, గుండె సంబంధిత సమస్యలు, తీవ్రమైన చర్మ వ్యాధులు కలిగించే అవకాశముంది. కొన్ని యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Recent Random Post:















