రణబీర్ కపూర్ ‘రామాయణం’ షూటింగ్ గాసిప్స్ – డూప్‌తో సన్నివేశాలు?

Share


నటుడి కాల్షీట్ల సమస్య కారణంగా ప్రధాన పాత్రధారి లేకుండా సినిమా షూటింగ్ కొనసాగించాల్సి వస్తే, ఆ ప్రభావం చివరికి బయటపడడం ఖాయం. పాత్రలు, పాత్రధారుల మధ్య సమన్వయం లేకుండా ప్రధాన పాత్రధారి మళ్లీ షూటింగ్‌కి వచ్చే సరికి సరిగ్గా మిళితమవ్వకపోవడం ఓ పెద్ద సమస్యగా మారొచ్చు. ఇప్పుడు అదే పరిస్థితి నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’కు ఎదురవుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రణబీర్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్ అండ్ వార్’ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉండడంతో, ‘రామాయణం’ కోసం తన కాల్షీట్లు కేటాయించలేకపోతున్నాడట. ఈ నేపథ్యంలో నితీశ్ తివారీ, రణబీర్ లేకుండానే కొన్ని సన్నివేశాలను డూప్ సహాయంతో తెరకెక్కిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. భారీ వీఎఫ్ఎక్స్‌తో రూపొందనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం డైరెక్టర్, పోస్ట్-ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మొదటి భాగం షూటింగ్‌ను పూర్తి చేసేందుకు జట్టు శ్రమిస్తుండగా, రెండో భాగం ఇంకా ప్రారంభమవ్వాల్సి ఉంది. రణబీర్ జూన్ నెల నాటికి తిరిగి రామాయణం సెట్స్‌లోకి వస్తారని సమాచారం.

శ్రీరాముడి పాత్రలో నటించడానికి అత్యధిక నిబద్ధత, భక్తి శ్రద్ధలు అవసరం. కానీ రణబీర్ ఈ ప్రాజెక్ట్‌కి పూర్తిగా అంకితభావంతో అంకితమయ్యాడా అనే విషయంలో ఇప్పటికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను ఈ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టలేదనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ప్రముఖ సీనియర్ నటుడు, ‘శక్తిమాన్’ ఫేమ్ ముఖేష్ ఖన్నా ఇప్పటికే రణబీర్ శ్రీరాముడి పాత్రకు సరిపోడని విమర్శించిన సంగతి తెలిసిందే. రణబీర్ ఈ సినిమా పట్ల మరింత శ్రద్ధ కనబరిచి తన పాత్రను న్యాయంగా పోషించగలడా? అనేది చూడాల్సి ఉంది.


Recent Random Post: