రాజా సాబ్ స్పెషల్ సాంగ్‌లో తమన్నా?

Share


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో “ది రాజా సాబ్” ప్ర‌త్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ షూటింగ్ ప్రస్తుతం శ‌ర‌వేగంగా కొనసాగుతోంది. కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆలస్యం అయినా, ఇప్పుడు తిరిగి అనుకూల పరిస్థితుల్లో టీమ్ సినిమా పనులను వేగవంతం చేసింది.

ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారిగా హారర్ కామెడీ జానర్ లో నటిస్తుండడం విశేషం. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందన్న వార్తలు మొదటి నుంచి చర్చనీయాంశంగా మారాయి. ఆ సాంగ్ కోసం ఏ హీరోయిన్‌ను తీసుకుంటారన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆ స్పెషల్ సాంగ్‌లో తమన్నా నర్తించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ “ఐటెం సాంగ్స్ క్వీన్”గా పేరు తెచ్చుకున్న తమన్నా, ఈసారి ప్రభాస్‌తో కలిసి స్టెప్పులు వేయనుందా అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం షూటింగ్ డేట్స్ విషయంలో చిత్ర యూనిట్ ఆమెతో చర్చలు జరుపుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది.

గతంలో రెబల్, బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాల్లో ప్రభాస్‌కు జోడిగా నటించిన తమన్నా, ఇప్పుడు స్పెషల్ సాంగ్‌లోనైనా అతనితో మళ్లీ స్క్రీన్ పంచుకోవడం అభిమానులకు ఆసక్తికర అంశంగా మారింది.

ఇక సినిమా విషయానికి వస్తే – “ది రాజా సాబ్” లో ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో చూడవచ్చని ఇప్పటికే విడుదలైన టీజర్‌లో స్పష్టమైంది. సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను డిసెంబర్ 5, 2025న విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


Recent Random Post: