లూసీఫర్‌ సీక్వెల్‌: రజినీ స్పూర్తిగా మోహన్‌లాల్ ఎంట్రీ!

Share


మోహన్‌లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన లూసీఫర్ మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా పృథ్వీరాజ్ తన దర్శక ప్రతిభను నిరూపించుకోగా, మోహన్‌లాల్ కూడా పవర్‌ఫుల్ పాత్రలో మెప్పించారు. కేవలం హిట్ టాక్‌నే కాదు, కమర్షియల్‌గా కూడా సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సూపర్ హిట్ మూవీని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ అనే టైటిల్‌తో రీమేక్ చేశారు. నయనతార ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

ఇప్పుడు లూసీఫర్ కి సీక్వెల్‌గా రూపొందిన L2: Empuraan మార్చి 27న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

ఈ నేపథ్యంలో దర్శకుడు పృథ్వీరాజ్ లూసీఫర్ సినిమాలోని ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా, మోహన్‌లాల్ ఎంట్రీ సీన్‌ గురించి ఆయన చెప్పిన విషయం సినీ ప్రియులను ఆకర్షిస్తోంది. ఆయన మాట్లాడుతూ, “లూసీఫర్‌లో మోహన్‌లాల్ ఎంట్రీ సీన్ హైలైట్‌గా నిలిచింది. నిజానికి, ఆ సన్నివేశాన్ని రజినీకాంత్‌ స్పూర్తితో రూపొందించాను. చెన్నైలోని పోయోస్ గార్డెన్ వీధిలో రజినీ ఇంటి బయట ఎప్పుడూ అనుభవించే వాతావరణాన్ని గురించి ఒక వార్త చదివాను. ఆ వార్త నాకు గొప్ప ప్రేరణ ఇచ్చింది. దానినే ఆధారంగా తీసుకుని లూసీఫర్‌లో మోహన్‌లాల్ ఎంట్రీ సీన్‌ను రూపొందించాను,” అని చెప్పారు.

పృథ్వీరాజ్ రజినీకాంత్‌కు పెద్ద అభిమానిని అనే విషయం సినీ వర్గాలకు తెలిసిందే. ఆయన రజినీని డైరెక్ట్ చేయాలనే ఆసక్తిని కూడా వ్యక్తం చేశారు. L2: Empuraan ట్రైలర్‌ను మొదటగా రజినీకే చూపించానని, ఆయన ఆశీస్సులు తీసుకున్నానని పృథ్వీరాజ్ తెలిపారు. “రజినీ సార్ ట్రైలర్ చూసిన తర్వాత చెప్పిన మాటలను నేనెప్పటికీ మర్చిపోలేను,” అని పేర్కొన్నారు. గతంలో రజినీని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినా, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని, అయితే భవిష్యత్తులో ఆయనతో సినిమా చేయాలని ఎంతో ఆశించానని పృథ్వీరాజ్ వెల్లడించారు.

ఇప్పుడు L2: Empuraan విడుదలకు సిద్దమవుతుండటంతో ఈ వార్త సినీ ప్రియుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ సీక్వెల్‌ లూసీఫర్ స్థాయిలో అద్భుత విజయం సాధిస్తుందా అనేది చూడాల్సిందే!


Recent Random Post: