
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ ప్రమోషన్ కార్యక్రమాలు మెల్లగా మొదలయ్యాయి. ఒకవైపు సినిమా షూటింగ్ జరుగుతుండగా, మరోవైపు ప్రమోషన్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి.
ఇటీవల ప్రముఖ మీడియా సంస్థ స్క్రీన్ రాంట్ ప్లస్ కు వారణాసి యూనిట్ ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళితో పాటు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొని సినిమాతో పాటు పలు ఆసక్తికర అంశాలపై మాట్లాడారు. సినిమా విషయాలకే పరిమితం కాకుండా వ్యక్తిగత అనుభవాలు, సంస్కృతి, జీవనశైలి గురించి కూడా వారు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఇంటర్వ్యూలో ముఖ్యంగా మహేష్ బాబు కేరళ మరియు కలరి విద్య గురించి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కలరి విద్య తనకు ఎంతో ఇష్టమని, ఒక సినిమా కోసం ఆరు నెలల పాటు కలరి విద్యను నేర్చుకున్నానని మహేష్ వెల్లడించారు. కలరి విద్య శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా బాడీలోని వివిధ భాగాలను బలంగా చేస్తుందని, అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు సహాయపడుతుందని ఆయన తెలిపారు. మహేష్ మాటలు వింటూ పక్కనే ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ షాక్‌కు గురవ్వడం గమనార్హం. మహేష్ బాబు ఇంత ఫిట్‌గా ఉండటానికి కలరి విద్య కూడా ఒక ప్రధాన కారణమనే చర్చ నడుస్తోంది.
ఇక ప్రియాంక చోప్రా కూడా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన అమ్మమ్మ కేరళకు చెందినవారని చెప్పుతూ, తనకు కూడా కేరళతో ప్రత్యేక అనుబంధం ఉందని వెల్లడించారు. అలాగే కేరళలో ప్రసిద్ధమైన కలరి విద్యపై తనకు మంచి అవగాహన ఉందని చెప్పారు. ప్రియాంక మాటలు విని పృథ్వీరాజ్ సుకుమారన్ ఆశ్చర్యపోతూ ‘అవునా?’ అని ప్రశ్నించడం అక్కడ హైలైట్‌గా నిలిచింది.
మొత్తంగా వారణాసి యూనిట్ సభ్యులు కేరళతో తమ అనుబంధం, అక్కడి సంస్కృతి, ప్రత్యేకతల గురించి మాట్లాడడంతో ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కేరళకు చెందిన సినీ అభిమానులతో పాటు రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా అభిమానులు ఈ వీడియోలను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
ఇక మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ, భారత్‌లో ఆహారం ఎంత విభిన్నంగా ఉంటుందో వివరించారు. ప్రాంతానికొక ప్రత్యేక రుచి ఉంటుందని, భారతీయ సినిమాలు ఎలా విభిన్నంగా ఉంటాయో అలాగే ఫుడ్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. తాను సీ ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడతానని కూడా వెల్లడించారు.
వారణాసి సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు అంచనాలను భారీగా పెంచాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో విడుదల చేయాలనే లక్ష్యంతో భారీ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు రాజమౌళి నుంచి వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే, వారణాసి వాటన్నింటికీ మించి ఉండబోతుందనే నమ్మకంతో మహేష్ బాబు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Recent Random Post:















