సన్నాఫ్ సర్దార్ 2 తో అజయ్ దేవగన్ భారీ ప్లాన్!

Share


టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినీ ప్రయాణం మొదలుపెట్టిన 25 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ లోపు ఆయన దర్శకత్వంలో 12 సినిమాలు మాత్రమే వచ్చినా, ఒక్కొక్కటీ సూపర్ హిట్‌గా నిలిచాయి. రాజమౌళి సినిమాల్లో చాలావరకు హిందీలో కూడా విడుదలయ్యాయి. కొన్ని డబ్బింగ్ రూపంలో, మరికొన్ని రీమేక్ రూపంలో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించాయి.

ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి ఇటీవల బాలీవుడ్‌లో రీమేక్ అయిన విషయం తెలిసిందే. అలాగే విక్రమార్కుడు, మర్యాద రామన్న సినిమాలు కూడా హిందీలో రీమేక్ అయ్యాయి. మగధీరను కూడా రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరిగినా, ఆ మాయాజాలాన్ని మరోసారి సృష్టించడం కష్టం అని భావించి ఆ ఆలోచనను విరమించారు.

మర్యాద రామన్న సినిమా హిందీలో సన్నాఫ్ సర్దార్ పేరుతో 2012లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆయన కెరీర్‌కు ఓ మైలురాయిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.

అశ్విని ధీర్ దర్శకత్వం వహించిన తొలి భాగానికి భిన్నంగా, సన్నాఫ్ సర్దార్ 2 సినిమాకు విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల అజయ్ దేవగన్ నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈసారి పూర్తిస్థాయి వినోదాత్మక ఎంటర్‌టైనర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో సన్నాఫ్ సర్దార్ 2 సినిమా అజయ్ దేవగన్‌కు మరోసారి విజయం అందించనుందనే అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి భాగంలో కథలో చేసిన స్వల్ప మార్పులను కొనసాగిస్తూ, ఇప్పుడు సీక్వెల్‌కు కొత్త కథను డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, కుబ్రా సైట్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

జూలై 25, 2025న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆసక్తి నెలకొంది. అంతేకాదు, రాజమౌళి విక్రమార్కుడు రీమేక్ అయిన రౌడీ రాథోడ్ కు సైతం సీక్వెల్ ప్లాన్ చేస్తూ సంజయ్ లీలా భన్సాలీ ప్రయత్నాలు చేస్తున్నట్లు గత ఏడాది వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక మొత్తానికి, రాజమౌళి పాత హిట్ సినిమాలను బాలీవుడ్ మేకర్స్ పూర్తిగా వాడేసుకుని మరోసారి హిట్స్ కొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.


Recent Random Post: