సల్మాన్ సూపర్ హీరో మూవీలో సమంత భాగస్వామ్యం!

Share


Salman Khan కథానాయకుడిగా, దర్శక ద్వయం Raj Nidimoru – Krishna D.K. (రాజ్ అండ్ డీకే) దర్శకత్వంలో ఒక హై-కాన్సెప్ట్ సూపర్ హీరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయినట్లు సమాచారం. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో కాకుండా, తక్కువ ఖర్చుతో సింపుల్‌గా పూర్తి చేయాలన్నదే సల్మాన్ ఖాన్ ఆలోచన. భారీ బడ్జెట్ పెట్టి నిర్మాతలకు నష్టాలు రావడం తనకు ఇష్టం లేదని, ప్రాజెక్ట్ సైన్ చేసే ముందే ఆయన ఈ షరతు పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ Mythri Movie Makers, Reel Life Entertainmentతో కలిసి నిర్మించనుంది.

ఇదిలా ఉండగా, ఈ సినిమా నిర్మాణంలో Samantha Ruth Prabhu కూడా భాగస్వామిగా చేరనున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. సినిమా భారీ బడ్జెట్ కాకపోవడంతో, తాను కూడా కొంత పెట్టుబడి పెట్టేందుకు మైత్రీతో ఒప్పందం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సమంతా Tralala Moving Pictures అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి తెలుగులో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. యువ నటీనటులతో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను నిర్మిస్తూ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తోంది.

తొలి ప్రయత్నంగా ఆమె నిర్మించిన ‘శుభం’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తానే ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ అనే మరో చిత్రాన్ని కూడా స్వయంగా నిర్మిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతోనే సమంతా కంబ్యాక్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో బాలీవుడ్ దర్శక-నిర్మాత Raj Nidimoruను సమంతా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత రాజ్ నిడిమోరు దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం సల్మాన్ ఖాన్‌దే కావడం విశేషం. ఈ నేపథ్యంలో భర్త సహకారంతో సమంతా కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామి అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా బడ్జెట్‌కు సంబంధించిన వ్యవహారాలను రాజ్ అండ్ డీకే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కూడా ఆ బాధ్యతలను దర్శకులకే అప్పగించినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, రీల్ లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి సంస్థలు దర్శకులు కోరిన బడ్జెట్‌ను సమకూర్చడమే తమ బాధ్యతగా తీసుకున్నాయి. నిర్మాణంలో రాజీ పడని ఈ సంస్థలతో సమంతా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ భాగస్వామ్యం కావడం ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ మూడు సంస్థలు ఎంత శాతం చొప్పున పెట్టుబడి పెడుతున్నాయి అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. తొలుత ట్రాలాలా భాగస్వామ్యం లేకపోవడంతో మైత్రీ మరియు రీల్ లైఫ్ సంస్థలు 50-50 షేర్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు ట్రాలాలా చేరడంతో వాటాల లెక్కలు ఎలా ఉంటాయన్నది త్వరలోనే తేలనుంది.