
పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం “ఓజి” మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినా, ముందుగా థియేటర్లలో సందడి చేయాల్సింది “హరిహర వీరమల్లు” అనే విషయం తెలిసిందే. మే 9 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించినప్పటికీ, సినిమా అనుకున్న టైంకే వస్తుందా లేదా అనే అనుమానాలు ఇంకా కలుగుతున్నాయి. టీజర్లు, పాటలు ఆకట్టుకున్నా, ప్యాన్ ఇండియా స్థాయిలో ఆశించినంత హైప్ క్రియేట్ కాలేదు. ఇకపోతే, ఇప్పుడు సినిమాపై ఓ స్పష్టత వస్తోంది.
యూనిట్ సమాచారం ప్రకారం, “హరిహర వీరమల్లు” చివరి షెడ్యూల్ ఏప్రిల్ 7 నుంచి 14 వరకు ప్లాన్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొనే రోజులు కేవలం నాలుగు మాత్రమే. మిగిలిన సన్నివేశాలను దర్శకుడు జ్యోతి కృష్ణ ఇప్పటికే పూర్తిచేశారు. క్రిష్ తెరకెక్కించిన పార్ట్‌తో కలిపి, ఫైనల్ ఎడిటింగ్ దశలో సినిమా ఉంది. ప్రస్తుతం విదేశీ కంపెనీలు VFX పనులను ముగింపు దశకు తీసుకెళ్లాయి. ఏప్రిల్ చివరి వారానికి సెన్సార్ పూర్తిచేయాలన్నది నిర్మాత ఏఎం రత్నం లక్ష్యం.
ఇక అభిమానులు ఇక ధీమాగా ప్రచార కార్యక్రమాల్లో భాగమవ్వొచ్చు. ఇది మొదటి భాగం కావడంతో సీక్వెల్ పై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. అప్డేట్ ప్రకారం, “హరిహర వీరమల్లు పార్ట్ 2” కీలక సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరించేశారని సమాచారం. పవన్ కళ్యాణ్ డేట్స్ ఎక్కువగా అవసరం లేకుండా త్వరగా షూట్ పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. అయితే, మొదటి భాగం ఎంత సక్సెస్ అవుతుందో అనేదానిపైనే సీక్వెల్ స్పీడ్ ఆధారపడి ఉంటుంది.
నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ హిస్టారికల్ డ్రామా లో, బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో కనిపించనుండగా, ఎంఎం కీరవాణి అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది.
Recent Random Post:














