
స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విజయవంతమైన ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో టాప్ స్టార్ల చిత్రాలు మళ్లీ థియేటర్లలో విడుదలైతే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పడయప్పా (తెలుగులో నరసింహా) రీ రిలీజ్ అయ్యి సంచలన వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు రజినీకాంత్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇది రీ రిలీజ్ కాదు. దాదాపు 37 ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తయి విడుదలకు నోచుకోని ఓ చిత్రం ఇప్పుడు తొలిసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమానే హమ్ మే షెహెన్ షా కౌన్.
రజినీకాంత్, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా కీలక పాత్రల్లో నటించిన ఈ హిందీ చిత్రాన్ని 1988లో విడుదల చేయాలని భావించారు. హర్మేష్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా అనేక కారణాల వల్ల అప్పట్లో థియేటర్ల వరకు చేరుకోలేకపోయింది. ల్యాబ్‌లోనే నిలిచిపోయిన ఈ సినిమా ప్రింట్లను ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో రీమాస్టర్ చేస్తున్నారు.
నిర్మాత రాజా రాయ్ మాట్లాడుతూ, ఈ సినిమాపై తాము ఎప్పుడూ ఆశ వదలలేదని, ఎన్నో అవరోధాలు, నిశ్శబ్దంతో కూడిన కాలాన్ని ఈ చిత్రం ఎదుర్కొందని తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత ప్రేక్షకులను కలుసుకోబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని కూడా వెల్లడించారు.
ఇంకా విశేషమేంటంటే, ఈ చిత్రంలో దివంగత నటుడు అమ్రిష్ పురి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇన్నేళ్ల తర్వాత విడుదలవుతున్న ఈ సినిమాకు రజినీకాంత్ ప్రమోషన్ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Recent Random Post:















