40 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఇలా మాట్లాడటమా చంద్రబాబు?

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ పొలిటీషియన్ గా సుపరిచితులు మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు.. ఇప్పుడున్న దక్షిణాది రాజకీయ అధినేతల్లో బాబుకు సాటి రాగలిగిన అధినేత ఏ ఒక్కరు కనిపించరు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో బాబుకు ఎదురైన ఎత్తు పల్లాలు.. చేదు అనుభవాలు మరెవరికీ రాలేదనే చెప్పాలి. తాను అధికారంలో ఉన్న వేళలో ఆయన చేసిన మంచి పనులకు వచ్చే ఆదరణ కంటే కూడా ఆయన చేసిన తప్పులకు చెల్లించాల్సిన మూల్యమే అధికమని చెప్పాలి. అలాంటి ఆయన.. డెబ్భై ప్లస్ ఏళ్ల వయసులో తన రాజకీయ అనుభవం ఉన్నంత వయసుకున్న వ్యక్తితో పోటీ పడటం సామాన్యమైన విషయం కాదు.

సంప్రదాయ రాజకీయ నేతలకు.. రాజకీయాన్ని మరోలా చూసే నేతల తరానికి మధ్యనున్న సంధిదశకు చెందిన రాజకీయ నాయకుడిగా చంద్రబాబును చెప్పాలి. ఈ కారణంతోనే ఆయన అనుభవించిన రాజభోగం.. ఆయనకు ఎదురైన చేదు అనుభవాలు రెండూ ఎక్కువగానే ఉంటాయి. ఇదంతా ఎందుకంటే.. అంత సుదీర్ఘ రాజకీయ అనుభవం.. చేదు అనుభవాల్ని చవి చూసిన ఆయన.. సంక్లిష్ట పరిస్థితులు ఎదురైన వేళలో.. స్పందించే తీరు ఇప్పుడు కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉందని చెప్పాలి.

స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మారుస్తూ హటాత్తుగా నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాటికి కౌంటర్లు ఇస్తూ చంద్రబాబు పాలనలో అలా జరిగింది? అంటూ ఎత్తి పొడుపుల మాటలతో జగన్ సర్కారు ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యింది. ఇలాంటి సమయంలో విపక్ష నేతగా.. సీనియర్ రాజకీయ అధినేతగా.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా తన అనుభవాన్ని రంగరించి మాట్లాడాల్సిన మాటలకు భిన్నంగా.. సమకాలీనరాజకీయ నేతల మాదిరి మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

ఎన్టీఆర్ కంటే వైఎస్సార్ ఎలా గొప్ప? అన్న మాటతోపాటు.. అలా చెప్పుకోవటానికి సిగ్గుండాలన్న తీవ్రమైన మాట చంద్రబాబు నోటి నుంచి రాకూడదు. కానీ.. అలాంటి వ్యాఖ్య రావటం వల్ల సీఎం జగన్ కోరుకున్నదే జరుగుతుందన్నది చంద్రబాబు మర్చిపోకూడదు. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఆయన్ను అభిమానించేవారు.. వ్యతిరేకించే వారు ఉండేవారు. కానీ.. ఆయనకు ఎదురైన అనూహ్య మరణంతో పార్టీలకు అతీతంగా ఆయన్ను అభిమానించే వారు పెరిగారన్నది వాస్తవం. దాన్ని ఒప్పుకోవాలి. అలాంటి సానుకూలత ఉన్న ముఖ్యనేతను ఉద్దేశించి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎన్టీఆర్ పేరును తీసివేయటంపై అధికార వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడేలా.. అధినేత ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చంద్రబాబు మాట్లాడాలే తప్పించి.. ఆవేశంతో నోటికి వచ్చినట్లు మాట్లాడే సగటు రాజకీయ నేతగా మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అంతేకాదు.. ఇలాంటి తీరు చంద్రబాబుపై సానుభూతి కంటే అనవసరమైన ఆగ్రహాన్న పెంచేలా చేస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు.. కీలక వేళల్లో ఎమెషనల్ కావటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వివేకం ఉన్న వారు ఎవరూ.. ఎదుటోళ్లు రెచ్చగొడితే రెచ్చిపోరన్నది మర్చిపోకూడదు. అలా చేస్తే.. రెచ్చగొట్టే వాడికి.. రెచ్చిపోయేవాడికి తేడా ఏముంటుంది చెప్పండి?


Recent Random Post: