తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఈనాటిది కాదు. ఎప్పుడో 18 ఏళ్ళ క్రితం మాట అది. అప్పట్లో ‘బాబా’ అనే సినిమా వచ్చింది. రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధపడి రజనీకాంత్ చేసిన సినిమాగా ‘బాబా’ గురించి ప్రచారం జరిగింది. వస్తున్నా, వచ్చేస్తున్నా.. అంటూ రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ అప్పట్లో చూచాయిగా ప్రకటన కూడా చేశారు. ఏమయ్యిందోగానీ, ఆ తర్వాత రజనీకాంత్ రాజకీయ ప్రచారం అటకెక్కింది.
ఆ మాటకొస్తే, ‘బాబా’ సినిమా కంటే ముందే, ఆయన్ని రాజకీయాల్లోకి రావాల్సిందిగా అభిమానులు డిమాండ్ చేశారు.. అది కూడా రజనీకాంత్ స్కెచ్చేనని చాలామంది అంటారు తమిళనాడులో. ఆ లెక్కన, రజనీకాంత్ దాదాపు రెండు దశాబ్దాల క్రితమే రాజకీయ ఆలోచనలు చేశారని అనుకోవాలేమో. కానీ, ఇప్పటికీ రజనీకాంత్, రాజకీయ రంగ ప్రవేశంపై సరైన ప్రకటన మాత్రం చేయడంలేదు.
తాజాగా ఇంకోసారి అభిమానుల్ని రజనీకాంత్ వెర్రి వెంగళప్పల్ని చేసేశాడు. అభిమాన సంఘాలతో ప్రత్యేక భేటీ నిర్వహించిన రజనీకాంత్, షరామామూలుగానే తుస్సుమనిపించేశాడు. ‘త్వరలో రాజకీయ నిర్ణయం ప్రకటిస్తాను..’ అని చెప్పారాయన. రజనీకాంత్ కంటే ఆలస్యంగా పొలిటికల్ గాసిప్స్ కాలమ్స్‌లోకి ఎక్కిన కమల్‌హాసన్, ఆల్రెడీ పార్టీ పెట్టేశారు కూడా. శరత్‌కుమార్, విజయ్‌కాంత్ లాంటి పలువురు తారలు రాజకీయ పార్టీలు పెట్టారు.. రాజకీయాల్లో ‘మమ’ అన్పించేశారు. మరి, రజనీకాంత్ పరిస్థితేంటి.? ఆయన స్పష్టతనివ్వరు.. అభిమానులు ఆ స్పష్టత వచ్చేదాకా వదిలిపెట్టరు.
ఇప్పటికే రజనీకాంత్ అభిమానుల్లో చాలామంది ఆయన రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎదురుచూసీ చూసీ ముసలాళ్ళయిపోయారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అంటూ, ప్రస్తుతం దిగాలుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆయన సమస్యలు ఆయనకు వుండి వుండొచ్చు. కానీ, కొన్నాళ్ళ క్రితం, ‘రాజకీయాల్లోకి వచ్చేసినట్లే..’ అని చెప్పి, ‘త్వరలో నిర్ణయం ప్రకటిస్తా’ అని ఇప్పుడు చెప్పడమేంటి.? నూటికి నూరుపాళ్ళూ ఇది అభిమానుల్ని అయోమయంలోకి నెట్టేసి అదో టైపు ఆనందం పొందడం కిందకే వస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ స్థాయికి తగని పద్ధతి ఇది.
Recent Random Post: