గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తనను సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ మండలి ఛైర్మన్‌కి ఫిర్యాదు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక ఆసక్తికరమైన పరిణామంగా చెప్పుకోవచ్చేమో.
టీడీపీ కార్యకర్త మణిరత్నం అక్రమ అరెస్టును తాను తప్పు పడితే, తన హక్కులకు భంగం కలిగించేలా ట్విట్టర్‌లో అమ్మిరెడ్డి తనను ఉద్దేశించి పోస్టింగులు పెట్టారంటూ లోకేష్, మండలి ఛైర్మన్‌కి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం టీడీపీ కార్యకర్త మణిరత్నం అక్రమ అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా పెను దుమారానికి కారణమయ్యింది. ఈ క్రమంలో టీడీపీ వర్సెస్ గుంటూరు అర్బన్ ఎస్పీ అన్నట్లుగా వ్యవహారం నడిచింది.
సోషల్ మీడియా వేదికగా గుంటూరు అర్బన్ ఎస్పీ, టీడీపీ అధినేత చంద్రబాబుకీ, చంద్రబాబు తనయుడు లోకేష్‌కీ ‘ఫేక్ అలర్ట్’ జారీ చేశారు గుంటూరు అర్బన్ ఎస్పీ. అధికారులు, ఇలా రాజకీయ నాయకులకు సోషల్ మీడియా వేదికగా వార్నింగులు ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు ప్రజాస్వామ్యవాదులు.
నిజానికి, రాజకీయాలన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. వైసీపీ నేతలు చేసే ఆరోపణలపై పోలీసు అధికారులు పెదవి విప్పరు. ఎందుకంటే, వైసీపీ ప్రస్తుతం అధికారంలో వుంది గనుక. ఏకంగా అధికారుల్ని వైసీపీ నేతలు బెదిరిస్తున్న సంఘటనలూ తెరపైకొస్తున్నాయి. ‘మా మాట వినకపోతే శంకరగిరి మాన్యాలు పట్టించేస్తాం..’ అంటూ అధికారుల్ని ఎమ్మెల్యేలు బెదిరిస్తున్న వ్యవహారాలకు సంబంధించి ఆడియో టేపులు వెలుగులోకి వస్తున్నాయి. ఆయా కార్యక్రమాల్లో పోలీసు అధికారుల్ని అధికార పార్టీ నేతలు ఎంత చులకన చేస్తున్నారో.. వాటికి సంబంధించిన వీడియోలు వెలుగు చూస్తుండడంతో అర్థమవుతోంది.
అయితే, చంద్రబాబు హయాంలో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. ఆ మాటకొస్తే, ప్రతిపక్షంలో వున్నా అధికారుల్ని అధికార పార్టీ నేతలు బెదిరిస్తూనే వున్నారు. పాపం, మధ్యలో అధికారులే అటు వైసీపీ నుంచీ, ఇటు టీడీపీ నుంచీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక, లోకేష్ ఫిర్యాదుపై మండలి ఛైర్మన్ ఎలా స్పందిస్తారు.? ఈ ఉదంతంపై ఎస్పీ అమ్మిరెడ్డి వివరణ ఎలా వుంటుందనేది వేచి చూడాల్సిందే.
Recent Random Post: