జమిలి వస్తోందట.. ఫెడరల్‌ ఫ్రంట్‌ సంగతేంటట.!

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, బీజేపీ యేతర పార్టీలతో ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ ఏర్పాటు చేస్తామంటూ చాలాకాలం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సెలవిచ్చారు. తనకు ‘రాజకీయ అవసరం’ వచ్చిన ప్రతిసారీ, కేసీఆర్‌ ఈ ‘జాతీయ రాజకీయాల’ ప్రస్తావన చేస్తుండడం పరిపాటిగా మారిపోయింది.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఇటీవల గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో.. అంతకు ముందు దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా.. కేసీఆర్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చూశాం. ఏళ్ళు గడిచిపోతున్నాయ్‌.. కేసీఆర్‌ సారు, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేదెప్పుడు.? అంటే, ఆ ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ శ్రేణుల వద్ద కూడా సమాధానం లేదు. ‘మిమ్మల్ని ప్రధానిగా చూడాలని వుంది సారూ..’ అంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు.

కానీ, కేసీఆర్‌ చేతలు గడప దాటడంలేదు. మాటలు మాత్రం, కోటలు దాటేస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. పశ్చిమబెంగాల్‌లో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల హోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ రాకుండానే ఈ హంగామా నడుస్తోందక్కడ. మమతా బెనర్జీతో గతంలో కేసీఆర్‌ ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ చర్చలు జరిపారు. తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటైన స్టాలిన్‌తోనూ కేసీఆర్‌ మంతనాలు జరిపారు గతంలో. మరి, ఇప్పుడు ఏమయ్యింది కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పరిస్థితి.?

నిజానికి, ఇలాంటి సందర్భాల్లోనే ఆయా నాయకుల్ని కలుపుకుపోతే, జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం వుంటుంది. అయితే, కేసీఆర్‌ వ్యూహాలు వేరు. ఆయన రాజకీయ ఆలోచనలు వేరు. అంశాల వారీగా కేంద్రానికి మద్దతిస్తారు.. అదే సమయంలో, కేంద్రంపై విరుచుకుపడ్తారు. ఈ వైఖరి కేసీఆర్‌ పట్ల అనుమానాలకు కారణమవుతోంది.

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికలు ముగిశాక హైద్రాబాద్‌లోనే జాతీయ స్థాయి నేతల సమావేశమన్నారు. ఏదీ ఎక్కడ.? ప్రధాని మోడీకి ఎదురెళ్ళంత సాహసం సంగతి తర్వాత.. చిత్తశుద్ధి అంటూ వుండాలి కదా.! జమిలి ఎన్నికల చర్చ నేపత్యంలో అయినా, కేసీఆర్‌.. ‘జాతీయ రాజకీయాల’ ఆలోచనపై ఫోకస్‌ పెడతారా.? లేదంటే, భవిష్యత్తులో బీజేపీ మిత్రపక్షంగా టీఆర్‌ఎస్‌ మారిపోతుందా.? వేచి చూడాల్సిందే.


Recent Random Post: