సీనియర్ పొలిటీషియన్ ఆయన. జగన్ మంత్రి వర్గంలో మోస్ట్ సీనియర్. ఏం లాభం.? ఆ సినియారిటీ ఆయనకు సంస్కారం నేర్పినట్టు లేదు. లేకపోతే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని పట్టుకుని ‘బంట్రోతు’ అనడమేంటి.? వైసీపీలో చాలామంది నిమ్మగడ్డపై బూతులు కూడా అందుకున్న దరిమిలా, పెద్దిరెడ్డి కాస్త సంస్కారవంతంగా మాట్లాడారని అనుకోవాలేమో. ఆ స్థాయికి రాష్ట్రంలో రాజకీయం దిగజారిపోయింది. సరే, రాజకీయ పార్టీలు.. అవసరానికి తగ్గట్టు అధికారులపై విరుచుకుపడిపోవడం మామూలే. ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలో గత మార్చిలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ప్రభుత్వ పెద్దలకు ఆయనతో సమస్యల్లేవు. ఇదే నిమ్మగడ్డ హయాంలో వైసీపీ ఎంచక్కా ఏకగ్రీవాలు చేసేసుకుంది.. అరివీర భయంకరమైన అరాచకాలు సృష్టించేశి.
ఎప్పుడైతే, కరోనా నేపథ్యంలో నిమ్మగడ్డ స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారో.. ఆ తర్వాత నుంచే సీన్ మారిపోయింది. పాత విషయాల్ని పక్కన పెడితే, అధికార పార్టీకి చెందిన నేతలు, కొందరు మంత్రులు తనను పరుషంగా దూషిస్తుండడం పట్ల నిమ్మగడ్డ నిన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘మంత్రులు కూడా హద్దులు మీరడం బాధ కలిగింది’ అంటూ వాపోయారు నిమ్మగడ్డ. అయినాగానీ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను తగ్గేది లేదంటున్నారు నిమ్మగడ్డను విమర్శించే క్రమంలో. ‘చంద్రబాబుకి బంట్రోతు నిమ్మగడ్డ..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి.
గతంలో అప్పటి డీజీపీ ఆర్పీ ఠాగూర్ విషయంలో వైసీపీ ఏం ఆరోపణలు చేసింది.? ఇప్పుడాయన్ని వైసీపీ ఎలా గౌరవిస్తోంది.? టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి విషయంలో వైసీపీ గత వైఖరేంటి.? ప్రస్తుత వైఖరేంటి.? జనమే మధ్యలో వెర్రి వెంగళప్పల్లా కనిపిస్తున్నారు వైసీపీకి. ప్రస్తుతం నిమ్మగడ్డ మీద వైసీపీ విరుచుకుపడిపోతోందిగానీ.. రేప్పొద్దున్న పంచాయితీ ఎన్నికలు వైసీపీ అనుకున్నట్లుగానే జరిగితే, నిమ్మగడ్డను నెత్తిమీద పెట్టకుని పూజించెయ్యరూ.! రాజకీయం అంటేనే అంత. కాకపోతే, ఈలోగా సభ్య సమాజం వినలేని భాషని మీడియాలో అటెన్షన్ కోసం అధికార పార్టీ నేతలు ప్రయోగిస్తుంటారంతే.
Recent Random Post: