రాజధాని అమరావతి ప్రాంతంలోని అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై టీడీపీ నుంచే రెండు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే.. చంద్రబాబు మీద ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులెలా పెడతారు.?’ అన్నది టీడీపీ వాదన. అదే సమయంలో, చంద్రబాబు న్యాయ సలహా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నది టీడీపీ అనుకూల మీడియా నుంచి వినిపిస్తోన్నవాదన.
అయితే చంద్రబాబు, ఈ కేసులో విచారణకు వెళ్ళడం, వెళ్ళకపోవడానికి సంబంధించి పెద్ద చర్చే నడుస్తోంది మీడియా, రాజకీయ వర్గాల్లో. ‘సిల్లీ కేసు’ అని ఓ పక్క నారా లోకేష్ కుండబద్దలుగొట్టేస్తోంటే, ఇంకోపక్క ‘రాజకీయ కుట్ర.. కక్ష సాధింపుల పర్వం’ అని టీడీపీకి చెందిన ఇతర నేతలు చెబుతున్నారు. ఏది నిజం.? సిల్లీ కేసు అయితే, రాజకీయ కక్ష సాధింపు చర్చలకు ఆస్కారముండదు. ‘ఇదేదో 60-40 ఒప్పందాల వ్యవహారంలా వుంది.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేందుకు అర్హత సాధించిన ఎమ్మెల్యే రెడ్డి..’ అంటూ సోషల్ మీడియా వేదికగా అటు అధికార పార్టీపైనా, ఇటు ప్రతిపక్షంపైనా ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది.
ఇదిలా వుంటే, వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట గనుక, ఈ కేసు నుంచి ఆయన బయటపడటం పెద్ద కష్టమేమీ కాదని అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం మరో ఆసక్తికరమైన అంశం. తిరుపతి ఉప ఎన్నికల వేళ, అత్యంత వ్యూహాత్మకంగా టీడీపీకి జాకీలేసే ప్రయత్నంలో అధికార పార్టీ ఈ ‘సిల్లీ స్టెప్’ వేసిందనే వాదనలూ లేకపోలేదు.
ఈ మొత్తం రాజకీయ రచ్చ కారణంగా, అసలు అమరావతిలో కుంభకోణం జరిగిందా.? లేదా.? లక్ష కోట్లకు పైనే దోచేశారంటూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన వైసీపీ, తాము అధికారంలోకి వచ్చాక.. ఇంతవరకు ఒక్క రూపాయిని కూడా వెనక్కి తీసుకురాలేకపోవడాన్ని ఏమనాలి.? అన్నది ఇతర పార్టీల నుంచి దూసుకొస్తున్న ప్రశ్న.
కొసమెరుపేంటటే, ఆంధ్రపదేశ్ బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగనుండగా, సరిగ్గా ఈ సమయంలోనే చంద్రబాబుకి ఏపీ సీఐడీ నోటీసులు పంపడం. చంద్రబాబుకి ఏపీ సీఐడీ నోటీసులతో విశాఖ ఉక్కు వ్యవహారం తెరమరుగైపోయిందని అనుకోవచ్చా.?
Recent Random Post: