సినిమా వేరు రాజకీయం వేరు.. అని సాధారణంగా అందరూ చెబుతుంటారు. కానీ, సినిమా.. రాజకీయం.. ఒకటేనంటోంది ఆంధ్రపదేశ్ లోని అధికార పార్టీ. కక్ష సాధింపులకు ఏదైతేనేం.. అన్నట్టుంది తీరు. రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బ కొట్టడమే, ‘పరిపాలన’ అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘వకీల్ సాబ్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మామూలుగా అయితే, విడుదలకు ముందు రోజు స్పెషల్ షోలు వుంటాయి. వాటి కోసం అదనపు టిక్కెట్ ధరలూ వుంటాయి. సాధారణంగా పడే నాలుగు షోలకు అదనంగా మరికొన్ని షోలు వేసేందుకూ అవకాశముంటుంది. కానీ, ‘వకీల్ సాబ్’ సినిమాకొచ్చేసరికి ఇలాంటివేమీ లేవు.
పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎక్కడా ‘వకీల్ సాబ్’ సినిమాకి ఇబ్బందుల్లేవు. ఆంధ్రపదేశ్‌లోనే సమస్యలు తలెత్తాయి. కాదు కాదు, అధికార పార్టీ సమస్యలు సృష్టించింది. ‘కరోనా నేపథ్యంలో’ అనే కుంటి సాకు చూపి, ముందు రోజు (నిన్న రాత్రి) స్పెషల్ షోలను రద్దు చేసేశారు. అంతే కాదు, టిక్కెట్ ధరల విషయంలోనూ ఉక్కుపాదం మోపారు. మరీ ‘పేటీఎం కూలీ’ తరహాలో టిక్కెట్ ధరల్ని నిర్ణయిస్తూ జీవో విడుదల చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ‘జగనన్న దెబ్బ అదుర్స్..’ అని వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే, అధికార పార్టీ ఎంత వ్యూహాత్మకంగా ‘వకీల్ సాబ్’ని దెబ్బకొట్టి పైశాచికానందం పొందాలనుకుంటోందో అర్థమవుతోంది.
ఇక్కడ బులుగు బ్యాచ్‌కి అర్థం కావాల్సిన విషయమేంటంటే, ఈ బులుగు కుట్ర వల్ల పవన్ కళ్యాణ్‌కి వచ్చే నష్టమేమీ లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు రికార్డుల విషయంలో డీలా పడతారేమోగానీ.. సాధారణ ధరలకే టిక్కెట్లు లభ్యమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేయాలేమో. కానీ, సినిమాని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు నష్టపోవడం బాధ కలిగించే విషయం.
సినీ పరిశ్రమకు ఇది అస్సలేమాత్రం మంచిది కాదు. అయితే, విడుదలకు ముందే సినిమా పైరసీకి గురయినా, ‘అత్తారింటికి దారేది’ అత్యద్భుతమైన విజయం సాధించింది. ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో అంతకు మించిన విజయం నమోదవనుందన్నమాట. అంతా బాగానే వుందిగానీ, టిక్కెట్ ధరల్ని పరిమితం చేయడం అనేది కేవలం ‘వకీల్ సాబ్’ వరకే పరిమితమా.? భవిష్యత్తులో అన్ని సినిమాలకీ ఇదే వర్తిస్తుందా.? అన్నదానిపై జగన్ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వుంటుంది.
Recent Random Post: