ఈ రోజుల్లో ఓటర్లకు డబ్బులు పంచకుండా ఎన్నికలు జరిగే అవకాశం వుందా.? రాజకీయ పార్టీలు, ఓటర్లను ప్రలోభపెట్టకుండా వుండగలవా.? రాజకీయ పార్టీల నుంచి ఓటర్లు డబ్బుల్ని ఆశించకుండా వుంటారా.? అవకాశమే లేదు. ఎన్నికలంటేనే డబ్బు మయం. ఓ అసెంబ్లీ స్థానం కోసమే 10 నుంచి 25 కోట్లు, ఆ పైన ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి.
తెలుగు రాష్ట్రాలో, అందునా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో పరిస్థితి మరీ దారుణం. చంద్రబాబు హయాంలో నంద్యాల ఉప ఎన్నిక చూశాం.. వైఎస్ జగన్ హయాంలో తిరుపతి ఉప ఎన్నిక చూస్తున్నాం. సరిహద్దుల్లో పెద్దయెత్తున నగదునీ, మద్యం తరలిస్తున్న వాహనాల్నీ పోలీసులు పట్టుకోవడం చూశాం. ఇంటింటికీ వెళ్ళి ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర బహుమతులు పంచిన వైనం కూడా స్థానికంగా అందరూ చూసిందే. కానీ, తిరుపతి ఉప ఎన్నికలో అసలు డబ్బులు పంచడమే జరగలేదట ఈసారి. అలాగని బులుగు మీడియాలో విశ్లేషణలు షురూ అయ్యాయి.
ఎలాగూ తామే గెలుస్తాం కాబట్టి, ప్రలోభాలకు గురిచేయాలన్న ఆలోచననే వైసీపీ పక్కన పడేసిందట. వైసీపీ గెలుస్తుంది కాబట్టి, ఖర్చు దండగ.. అని ప్రధాన ప్రతిపక్షం లైట్ తీసుకుందట. అలా, తిరుపతి ఉప ఎన్నిక ద్వారా సరికొత్త రాజకీయం తెరపైకొచ్చిందని బులుగు మీడియా విశ్లేషిస్తోంది. ఇదెక్కడి చోద్యం.? ఎవరి కళ్ళుగప్పేయాలని ఈ తరహా చెత్త విశ్లేషణల్ని ప్రచారం చేస్తున్నట్లు.?
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రజాస్వామ్యం తిరుపతిలో ఖూనీ అయ్యింది. దొంగ ఓటర్లు విచ్చలవిడిగా పొరుగు ప్రాంతాల నుంచి వచ్చి, ఓట్లేశారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏజెంటు ఓటునే ఓ దొంగ ఓటరు వేసేయబోయాడు. ఇవన్నీ కళ్ళముందు కనిపిస్తున్న సాక్ష్యాలే. ఓటర్లకు డబ్బులు పంచుతూ చాలామంది తిరుపతి నియోజకవర్గ పరిధిలో కనిపించారు. అయితే, దొంగ ఓటర్ల హంగామా నడుమ, మిగతా విషయాలన్నీ హైలైట్ అవలేకపోయాయంతే.
100 కోట్లు ఆ పైన తిరుపతి ఉప ఎన్నిక కోసం ఖర్చయ్యిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అయినా, ‘అబ్బే, డబ్బు ప్రమేయం లేకుండానే తిరుపతి ఉప ఎన్నిక జరుగుతోంది’ అని ఎవరైనా అంటే, కళ్ళుండీ వాస్తవాల్ని చూడలేని గుడ్డితనం అనుకోవాలంతే.
Recent Random Post: