వైద్యం అడుగుతోంటే, ఉచిత బియ్యం ఇస్తామంటారేంటబ్బా.?

కరోనా పాండమిక్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకోసారి ఉచిత బియ్యం ‘స్కీం’ని తెరపైకి తెచ్చాయి. ఐదేసి కిలోల చెప్పున రెండు నెలలపాటు బియ్యం లేదా గోధుమలు ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.. అదీ పేదలకు మాత్రమే. నిజానికి, ప్రస్తుత పరిస్థితుల్లో పేదోడి కడుపు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నా తప్పు పట్టాల్సిన పనిలేదు. ఆంధ్రపదేశ్ రాష్ట్రం ఇంకో అడుగు ముందుకేసి, పది కేజీలు, ఎక్కువమంది లబ్దిదారులకు బియ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీన్ని కూడా అభినందించి తీరాల్సిందే.

కానీ, అసలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిందేంటి.? చేస్తున్నదేంటి.? కరోనా మొదటి వేవ్.. విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని తప్పు పట్టలేని పరిస్థితి. దాని తీవ్రత ఎలా వుంటుందో అప్పుడెవరికీ తెలియదు. కానీ, రెండో వేవ్ నాటికి.. కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయాయంటే, ఏమనుకోవాలి.?

ఆసుపత్రుల్లో బెడ్స్ లేవు.. మందుల కొరత.. ఆక్సిజన్ సమస్య.. వెరసి, నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 90 శాతం మందికి హోం ఐసోలేషన్, ఇంటివద్దనే సాధారణ చికిత్సతో నయమయిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్న దరిమిలా, ఆ దిశగా అవగాహన ఎందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. కరోనా బాధితులందరికీ అవసరమైన ‘కిట్స్’ (మందులతో కలుపుకుని) ఉచితంగా ఇవ్వగలిగి వుంటే, అసలు ఆసుపత్రుల వైపు బాధితులు పరుగులు పెట్టే అవకాశమే వుండేది కాదు.

ఫెయిల్యూర్.. అట్టర్ ఫెయిల్యూర్.. ఇంతకన్నా సరైన పదాలు వెతకలేని పరిస్థితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో. రాజకీయాలు తప్ప, మన పాలకులకి ప్రజారోగ్యం పట్టదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? డైవర్షన్ పాలిటిక్స్, పబ్లిసిటీ పాలిటిక్స్.. ఇవే కావాలి అధికారంలో వున్నోళ్ళకి. కేంద్రం, సగం మందికే ఇస్తోంది.. ఐదు కిలోలే ఇస్తోంది.. రాష్ట్రం పెద్ద మనసు చేసుకుని, ఉద్ధరించేస్తున్నామంటూ పబ్లసిటీ స్టంట్లు చేయడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

ఓ వైపు ప్రాణాలు పోతున్నాయ్ మహాప్రభో.. అంటే, ఉచిత బియ్యంతో ప్రచార ఆర్భాటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఇప్పుడు ప్రజలకు కావాల్సింది వైద్యం. నల్ల బజారుకి మందులు, ఆక్సిజన్ వెళ్ళకుండా చేయలేని ప్రభుత్వాలు, ప్రజల్ని ఉద్ధరించేస్తాయనుకోవడం వెర్రితనం.


Recent Random Post: