బెయిల్ రద్దు పిటిషన్: సీఎం వైఎస్ జగన్‌కి సీబీఐ కోర్టు నోటీసులు

‘బెయిల్ రద్దు కోరుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కుట్రపూరితంగా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినంతమాత్రాన జగన్ బెయిల్ రద్దవుతుందా.? అవ్వదుగాక అవ్వదు. పైగా, కోర్టు మొట్టికాయలేసి.. జరీమానా కూడా విధిస్తుంది..’ అంటూ వైసీపీ రెబ్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వెటకారం అంతా ఇంతా కాదు.

అయితే, రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ని ఇప్పటికే విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, తాజాగా జగన్ మోహన్ రెడ్డికీ, సీబీఐకీ నోటీసులు జారీ చేసింది. మే నెల 7వ తేదీకి కేసు తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారంటూ రఘురామకృష్ణరాజు, సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. అక్రమాస్తుల కేసులో గతంలో అరెస్టయిన వైఎస్ జగన్, ఆ తర్వత కొన్ని నెలలపాటు జైల్లో రిమాండ్ ఖైదీగా వున్నారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ నిబంధనల ప్రకారం ప్రతి శుక్రవారం వ్యక్తిగతంగా కోర్టులో విచారణకు హాజరు కావాల్సి వుండగా, ముఖ్యమంత్రి హోదాలో తనకు బాధ్యతలున్నాయనీ, అదే సమయంలో తాను వ్యక్తిగతంగా కోర్టుకు విచారణ నిమిత్తం హాజరైతే, ప్రభుత్వానికి అదనపు ఖర్చు అనీ.. గతంలో వైఎస్ జగన్ కోర్టుని అభ్యర్థించారు.

మరోపక్క, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నరానీ, రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనీ, తనకు సైతం ముఖ్యమంత్రి నుంచి ప్రాణహాని వుందనీ రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు.

మొత్తమ్మీద, రఘురామకృష్ణ పిటిషన్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమయ్యిందన్నమాట. మరి, కోర్టు నోటీసులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలా సమాధానమిస్తారు.? తదుపరి న్యాయస్థానంలో జరిగే విచారణ తర్వాతి పరిణామాలు ఎలా వుండబోతున్నాయి.? రఘురామ ఆశించింది జరుగుతుందా.? లేదంటే, కోర్టులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊరట దొరుకుతుందా.? వేచి చూడాల్సిందే.

Share


Recent Random Post: