ఏపీలో 14 మెడికల్ కాలేజీలకు జగన్ శంకుస్థాపన

రాష్ట్ర విభజన తర్వాత వైద్యపరంగా సరైన సౌకర్యాలు లేక విలవిలలాడుతున్న ఏపీలో 14 కొత్త మెడికల్ కాలేజీలకు సోమవారం సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో కొత్త మెడికల్ కాలేజీలు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదవారికి వైద్య సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వైద్య కళాశాలల కోసం రూ.8వేల కోట్లు వెచ్చించనున్నట్టు చెప్పారు.

వీటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. మొత్తం 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోగా.. ఇప్పటికే పులివెందుల, పాడేరు కళాశాలల పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 176 పీహెచ్ సీలు ఏర్పాటు చేయనున్నట్టు జగన్ ప్రకటించారు. మండలానికి కనీసం రెండు కొత్త పీహెచ్ సీలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 10,111 విలేజ్, 560 అర్బన్ క్లినిక్ లు అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్తగా నిర్మించనున్న ఆస్పత్రులు 2023 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.


Recent Random Post: