‘విశాఖ వైపుగా.. వడివడిగా..’ అడుగులేస్తున్న సీఎం వైఎస్ జగన్.?

విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందా.? లేదా.? ఇదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చనే. ఎందుకంటే, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో వుంది. చంద్రబాబు హయాంలో అమరావతి, రాష్ట్రానికి రాజధాని అవడం, ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో ఒకటి కాదు.. మూడు రాజధానులంటూ అసెంబ్లీలో చట్టం చేయడం తెలిసిన విషయాలే. ఆ చట్టం అమలు విషయమై ‘స్టేటస్ కో’ ఆదేశాలున్నాయి హై కోర్టు నుంచి.

అమరావతి అనేది రైతులతో ముడిపడి వున్న అంశం. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ, ఈ క్రమంలో రైతుల నుంచి భూముల్ని సమీకరించడం.. ఇలా చాలా వ్యవహారాలున్నాయి.. అవన్నీ ఓ కొలిక్కి వస్తే తప్ప, విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలి వెళ్ళే అవకాశం లేదు. మధ్యేమార్గంగా ఏం చేద్దా.? అన్నదానిపై చాలాకాలంగా వైఎస్ జగన్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. చివరాఖరి ఆప్షన్ కింద క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తే ఎలా వుంటుందన్న ఆలోచన చేస్తున్నారట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయం నుంచి క్యాంపు కార్యాలయానికి ప్రత్యేకంగా ఓ ‘రాచమార్గం’ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే, ప్రస్తుతం అమరావతిలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి, గన్నవరం వెళ్ళి.. అక్కడి నుంచి విశాఖ విమానాశ్రయం చేరుకుని, అట్నుంచి విశాఖ క్యాంప్ కార్యాలయానికి వెళ్ళి, విధులు నిర్వహిస్తారన్నమాట ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

ఇది కార్యరూపం దాల్చడం ఎలా సాధ్యం.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ముహూర్తం జులై 23వ తేదీ.. అనే ప్రచారం గట్టిగా సాగుతోంది. కేంద్ర హోం మంత్రి, గవర్నర్.. ఇలా పలువురు ముఖ్యులకు ఇప్పటికే వైఎస్ జగన్ ఈ విషయమై సమాచారమిచ్చారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ఊహాగానాలే నిజమైతే, రాష్ట్రానికి అది మరో ఆర్థిక భారం అవుతుంది. అయితేనేం, ప్రభుత్వాధినేత పంతం నెగ్గుతుంది కదా.?

అంతా బాగానే వుందిగానీ.. ఈ వ్యవహారంపై ఎవరన్నా కోర్టుల్ని ఆశ్రయిస్తే.. కోర్టుల్లో ప్రభుత్వానికి చుక్కెదురైతే.?


Recent Random Post: