జగన్ సర్కార్ మాటల మాయాజాలం.. కృష్ణమ్మ చేజారిపోతోంది.!

చెబుతున్న మాటలకీ, జరుగుతున్న వ్యవహారాలకీ అస్సలేమన్నా పొంతన వుందా.? చుక్క నీరు కూడా వదిలే ప్రసక్తే లేదని నిన్న బీభత్సమైన ప్రకటన చేసేశారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ‘ఇక్కడున్నది పవర్ పుల్ లీడర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోం..’ అంటూ ప్రకటన చేశారు. కానీ, జరుగుతున్నదేంటి.? వేల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది ప్రకాశం బ్యారేజీ నుంచి.

ఎగువన శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రభుత్వం, నిర్మొహమాటంగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా కిందికి వదిలేస్తోంది. నిజానికి, ఈ నీటిని రెండు రాష్ట్రాలూ సద్వినియోగం చేసుకోవాల్సి వుంది. తెలంగాణ ప్రభుత్వం తన అవసరాల మేరకు సద్వినియోగమే చేసుకుంటోంది. ఆంధ్రపదేశ్ రాష్ట్రమే.. నీటిని వాడుకోలేని దుస్థితిలో కొట్టమిట్టాడుతోంది.

ఏ లంచ్ మీటింగో.. లేదంటే డిన్నర్ మీటింగో ప్లాన్ చేసుకుని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఆంధ్రపదేవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ నీటి వృధాని అరికట్టొచ్చు కదా.? ‘ఎక్కడ మాట్లాడాలో మాకు తెలుసు.. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోం..’ అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల తీరిగ్గా చెప్పారుగానీ, కృష్ణా నది నుంచి వృధాగా పోతున్న నీరు అయితే ఆగదు కదా.?

ముందు ముందు వరదలొస్తాయ్.. ఇప్పుడు పోయిన నీటితో ఇబ్బందేమీ లేదని వైఎస్ జగన్ సర్కార్ లైట్ తీసుకుంటోందేమో.. అందుకే, తెలంగాణ సర్కారు పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి, ఇప్పుడు సముద్రంలోకి వదిలేస్తున్న నీటిలో ఖచ్చితంగా ఆంధ్రపదేశ్ వాటా వుంది. ప్రతి నీటి చుక్కా విలువైనదే ప్రస్తుతం. ఇప్పుడు తెలంగాణపై పోరాటం చేయలేకపోతే, ముందు ముందు రాష్ట్రం హక్కుల్ని తెలంగాణకు రాసిచ్చేసినట్లే అవుతుందని నీటి పారుదల రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఏకంగా మూడు ప్రాజెక్టుల మీద తెలంగాణ ప్రభుత్వం పెత్తనం చేస్తోంటే, చేష్టలుడిగా చూస్తోన్న జగన్ సర్కారుని ఏమనాలి.? ఇంకా చంద్రబాబు మీద పడి ఏడవడం వల్ల వైసీపీ, రాష్ట్రానికి ఏమైనా మేలు చేస్తోందా.? తాము ఏమీ చేయలేమని వైసీపీ చేతులెత్తేస్తే.. ప్రజలే రాష్ట్ర హక్కుల కోసం నినదించాల్సి వస్తుంది.. అలాంటి పరిస్థితి.. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యతకు చేటు తెస్తుంది.


Recent Random Post: