జల యుద్ధం: సంయమనం సరే.. తెలంగాణతో సమన్వయమేది బొత్సగారూ .!

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం జరుగుతోంది. ‘యుద్ధం’ అనే మాట ఖచ్చితంగా ఇక్కడ వాడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాల్ని, ఆవేదననీ అస్సలేమాత్రం పట్టించుకోకుండా, నిర్దయగా తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి జల విద్యుదుత్పత్తి ద్వారా కృష్ణా నది నీటిని కిందికి వదిలేస్తోంది. అలా ఇప్పటికే మూడు టీఎంసీలకు పైగా నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయినట్లు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డినీ, ప్రస్తుత ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డినీ, నర రూప రాక్షసుడనీ, దొంగ, గజదొంగ అనీ, నీటి దొంగ అనీ.. తెలంగాణ నాయకులు తిడుతున్నా, చీమూ నెత్తురూ లేనట్టు వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. పైగా, ‘సంయమనం పాటిస్తున్నాం..’ అంటూ బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ పొలిటీషియన్లు వ్యాఖ్యానిస్తుండడం వైసీపీ శ్రేణుల్ని ఆశ్చర్యపరుస్తోంది.

సరే, వైఎస్సార్ మీదా, వైఎస్ జగన్ మీదా తెలంగాణ నేతల తిట్ల వర్షాన్ని.. ప్రశంసల వర్షంగా వైసీపీ నేతలు భావిస్తే.. అది వారి విజ్ఞత. కానీ, మూడు టీఎంసీల నీరు వృధా అయ్యిందంటే.. అది రాష్ట్ర సమస్య. ఇక్కడ వైసీపీ నేతల సంయమనమెవడిక్కావాలి.? తెలంగాణ ప్రభుత్వంతో ఆంధ్రపదేశ్ ప్రభుత్వ పెద్దల సమన్వయం కావాలి. కానీ, ఆ సమన్వయం కోసం ఆంధ్రపదేశ్ నుంచి సరైన ప్రయత్నాలే జరుగుతున్నట్టు లేదు.

వచ్చేది వర్షా కాలమే అయినా, ఆ వర్షాకాలంలో ప్రాజెక్టులు నిండుతాయన్న గ్యారంటీ లేదు. ప్రాజెక్టులు నిండకపోతే, రాష్ట్రంలో కరువు తాండవిస్తుందన్నది నిర్వివాదాంశం. అయినా, అమరావతి మీద ముంపు ప్రాంతమనీ, ఎడారి అనీ, స్మశానమనీ నిందలేసే క్రమంలో సంయమనం పాటించని వైసీపీ నేతలు, మంత్రులు.. పొరుగు రాష్ట్రం ఆంధ్రపదేశ్ వాటా నీళ్ళని దోచుకుంటోంటే ఎందుకు సుతిమెత్తగా వ్యవహరిస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.

అధికార వైసీపీ నేతలు, తెలంగాణలోని అధికార పక్షానికి బానిసత్వం చేస్తున్నారా.? అందుకే, ఏపీ ప్రయోజనాల్ని తెలంగాణ దెబ్బ తీస్తున్నా చేవచచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారా.? సమస్య జటిలం కాకుండా నివారించడం చేతకాక.. అసమర్థతని అలాగే చేతకానితనాన్ని ప్రదర్శిస్తూ, దానికి ‘సంయమనం’ అని కవరింగ్ ఇవ్వడం హాస్యాస్పదం కాక మరేమిటి.?


Recent Random Post: