దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ షర్మిల, తెలంగాణలో కొత్త రాజకీయ కుంపటిని.. అదేనండీ రాజకీయ పార్టీని ప్రకటించారు. పేరు వైఎస్సార్ తెలంగాణ పార్టీ. ఏమో, ముందు ముందు వైఎస్సార్ ఒరిస్సా పార్టీ, వైఎస్సార్ అమెరికా పార్టీ.. ఇలా ఎన్నెన్ని పుట్టుకు రాబోతున్నాయోనని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
ఇక, పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన షర్మిల, తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి వివాదంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి పిలిచి, భోజనం పెట్టారు.. కౌగలించుకున్నారు.. ఇప్పుడు ఈ నీళ్ళ సమస్యపై రెండు నిమిషాలు కలిసి కూర్చుని చర్చించుకోలేరా.?’ అంటూ కేసీయార్ మీద సెటైర్లు వేశారు షర్మిల.
అంతేనా, ‘ఇద్దరూ కలిసి తమ ఉమ్మడి శతృవుని ఓడించారు..’ అంటూ పరోక్షంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని వైసీపీ – టీఆర్ఎస్ కలిసి ఓడించడంపై షర్మిల వ్యాఖ్యానించడం గమనార్హం. ఇంతకీ, వైఎస్ జగన్ పేరెందుకు షర్మిల ప్రస్తావించలేదు.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని షర్మిల ఎందుకు అనలేకపోయారు.? ఎంత సుతిమెత్తగా షర్మిల, వైఎస్ జగన్ మీద సెటైర్లు వేశారో కదా.! చూస్తోంటే, అచ్చంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్టు చదవడం తప్ప, షర్మిల సొంతంగా చేసిన వ్యాఖ్యల్లా లేవివి.
లేకపోతే, నీటి సమస్య విషయమై వైఎస్సార్ తెలంగాణ పార్టీ నినాదం గురించి మాట్లాడుతూ, సమన్యాయం.. అంటారేంటి.? సమన్యాయంతో తెలంగాణ విడిపోయిందా.? నీళ్ళ పంపకం సరిసమానంగా వుంటుందా.? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, సమ వాటా పంపకం.. అంటున్నారు. అది ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందన్నది నిర్వివాదాంశం.
ఇక, కేసీయార్ మీద షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పార్టీ ఆవిర్భావ సమావేశంలో. వాటికి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అంతకు మించిన స్థాయిలో కౌంటర్ పడనుందనుకోండి. అది వేరే సంగతి. అన్నట్టు, అతి త్వరలో తెలంగాణలో షర్మిల పాదయాత్ర ప్రారంభం కాబోతోందట. వంద రోజుల్లో పాదయాత్ర మొదలు పెడతానంటున్నారు. వైఎస్ జగన్ కూడా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన విషయం విదితమే.
కాగా, వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, తన కుమార్తెకు వెన్నంటే వుంటున్నారు వైఎస్సార్టీపీ విషయంలో. తన బిడ్డలకు దాచుకోవడం, దోచుకోవడం తెలియదంటూ విజయమ్మ వ్యాఖ్యానించడం కొసమెరుపు. దోచుకోకుండా, దాచుకోకుండా వందల కోట్లకు, వేల కోట్లకు వైఎస్సార్ వారసులు ఎలా పడగలెత్తినట్లు.?
Recent Random Post: