రాసిపెట్టుకోండి.. ప్రభంజనం సృష్టిస్తాం: షర్మిల

ఏపీ సీఎం జగన్‌పై అలిగితే మాట్లాడటం మానేస్తాను కానీ.. పార్టీ ఎందుకు పెడతాను.. అలిగితే పార్టీలు పెట్టరు అని వైటీపీ అధినేత వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టానని అన్నారు. జగన్‌, తాను రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని పునరుధ్ఘాటించారు. లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..

వైఎస్‌ తెలంగాణ వ్యతిరేకి కాదని.. తెలంగాణ బాగు కోసం శ్రమించారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చింది ఆయనేనని చెప్పారు. ఆయన మరణం తర్వాతే తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని చెప్పారు. ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణపై ప్రేమ లేనట్టు కాదని.. తాను తెలంగాణకు వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. మహిళలు వ్రతాలు చేసుకోవాలని కేటీఆర్‌ అంటున్నారు.. నేను నిరుద్యోగుల కోసమే వ్రతం చేస్తున్నా అని అన్నారు. ఏపీలో జగన్ పాలనపై స్పందిస్తూ.. అక్కడ రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోందని అన్నారు.

సీఎంగా కేసీఆర్‌ విఫలమయ్యారని ఆమె అన్నారు. ఆయన ఒక నియంత కాబట్టే ఎవరూ ప్రశ్నించొద్దని అనుకుంటారు. సీఎం కేసీఆర్‌ మహిళలకు విలువ ఇవ్వరని.. సీఎంగా వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. ఉద్యమకారుడిగా ఆయనపై ఉన్నా సీఎం అయ్యాక ఆయనలోని దొర బయటకొచ్చారని.. ప్రజలకు సరైన న్యాయం చేయలేదని అన్నారు.

పార్టీ ఒక వ్యవస్థ.. తాను ఉన్నా లేకున్నా పార్టీ కొనసాగుతుందని.. ఒంటరినని తనకు భయం, బాధ లేవని అన్నారు. పగలు, ప్రతీకారాల కోసమే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వచ్చింది. వైఎస్‌ ప్రారంభించినట్టే తాను కూడా చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభిస్తానని.. రాసిపెట్టుకోండి.. ప్రభంజనం సృష్టిస్తాం అని ఈ సంధర్భంగా షర్మిల అన్నారు.


Recent Random Post: